15 August 2010

మిణుగురులు

పరిపూర్ణంగా మధువుతో వివశితమయ్యి, ముఖంలేని ఒక స్వరంచే స్వప్నింపబడి, మనం
ఆ రాత్రి ఇంటికి ఎలా చేరుకున్నాం?

***

బయట ప్రపంచం అర్థం కాని ఒక అంతం వైపుకు హడావిడిగా దూసుకు వెడుతుండగా, మనం
అక్కడ కూర్చున్నాం, చేతులలో మధుపాత్రలతో, హృదయాలలోని తపనతో
తాగుతూ స్వప్నిస్తూ, స్వప్నిస్తూ తాగుతూ మనం అక్కడ కూర్చున్నాం. మనకు ఎదురుగా
కూర్చున్న స్త్రీ (ఒంటరి, ఆమె ముఖం రూపం ధరించిన ఒంటరితనమని నువ్వు అన్నావు)
తదేకంగా తన మధుపాత్ర వైపు చూస్తుంది: (ఎలా అంటే ఆ మధువు నక్షత్రాలతో నిండిన విశ్వం అయినట్టూ,
అటువంటి విశ్వాన్ని ఆమెకోసమే మధువుగా మార్చినట్టు: అలా అని నువ్వన్నావు).
ఆ తరువాత ఆమె, మత్తు ప్రపంచపు వింతలోకంలో మనుషులకి మధువు అందించే దేవదూతను
తన వైపు రమ్మని సంజ్ఞ చేసి, అతడు చిరునవ్వుతో దగ్గరికి రాగానే ఏదో చెప్పబోయి, ఆగి
తల అడ్డంగా ఊపుతూ అంటుంది: "ఏమీ లేదు. నాకు ఎం కావాలో నేను మరచాను."

బయట, బహుశా ప్రపంచమూ పదాలూ అర్థం కాని ఒక అంతం వైపు ఇంకా దూసుకు వెడుతుండగా
ఆకస్మికంగా నువ్వు అడుగుతావు: నేను తాగుతున్ననా లేక స్వప్నిస్తున్నానా?

అవి రెండూ వేరు వేరని నాకు తెలీదు. అందుకే నేనేమీ చెప్పలేదు.

౨.

మధువుతో వివశితమయ్యి మనం ఇంకా అక్కడే స్వప్నిస్తూ తాగుతూ, తాగుతూ స్వప్నిస్తూ
కూర్చుని ఉన్నాం. బయట ప్రపంచం అర్థం ఉన్న లేదా అర్థం లేని
ఒక అంతం వైపుకి హడావిడిగా దూసుకు వెళ్లిందో లేదో పట్టించుకోవడం మానివేసాం మనం.
మనకు ఎదురుగా ఇంకా అక్కడే కూర్చున్న స్త్రీ ఇంకా తదేకంగా
తన గాజు పాత్రలోని మధువు వైపే చూస్తుంది. (ఎలా అంటే, ఆమె తాగుతున్నది
ఆ దైవపు రక్తం అయినట్టు: అలా అని నువ్వన్నావు). సంవత్సరాల బడలికతో వడలిపోయి వంగిన
ఆమె ముఖం ఆకస్మికంగా జ్ఞాపకపు కాంతితో మెరుస్తుంది. ఆ తరువాత ఆమె
వింత ప్రపంచపు మత్తులోకంలో మధువు అందించే
కరుణామయుడైన దూతను తన వైపు రమ్మని పిలిచి అంటుంది:
"నీకు తెలుసా నేను ఎం మరచిపోయానో? మూత్ర విసర్జనం చేయడం."

బయట మూత్రం చేయటం మరచిన ప్రపంచమూ పదాలూ ఇక ఇప్పుడు, ఒక లక్ష్యంతో
అర్థం ఉన్న అంతం వైపు దూసుకు వెడుతుండగా
ఆకస్మికంగా నువ్వు అంటావు: అవును అర్థమూ మూత్రమూ ఒకటే, వోదిలివేయాలి. చెప్పు:
నేను స్వప్నిస్తున్నానా లేక తాగుతున్నానా?

అవి అన్నీ వేరు వేరని నాకు తెలీదు. అందుకే నేను ఏమీ చెప్పలేదు.



మధువుతో మనం మధువుగా మారి మనం ఇంకా అక్కడే తాగుతూ స్వప్నిస్తూ, స్వప్నిస్తూ తాగుతూ
కూర్చున్ని ఉన్నాం. మన ఇద్దరిలోనూ ఇక ఎవ్వరికీ
ప్రపంచం కానీ పదాలు కానీ జ్ఞాపకం లేవు. ఇంతలోగా మన ఎదురుగా ఇంకా అక్కడే కూర్చుని ఉన్న
ఆ స్త్రీ క్రమంక్రమంగా దైవత్వాన్ని సంతరించుకుంటుంది. ఆ సంజ్ఞలు కూడా, క్రమంక్రమంగా
ప్రయత్నారహితమైన సీతాకోకచిలుక రెక్కల కధలికల్లా మారతాయి.
(ఎలా అంటే, జీవితాన్ని, మృత్యువునీ ఆలపిస్తున్న ఒక అనామక పక్షిలా మారిన ఆమెలా: అలా అని
నువ్వు అన్నావు.) నువ్వు అలా అంటుండగా
ఎదురుగా రక్తంగా మారిన మధువు వైపు చూస్తూ, మనమిద్దరం మాత్రమే అర్థం చేసుకోగల స్వరంతో
ఆమె అంటుంది: (ఎలా అంటే, అవి స్రవించే అస్తిత్వపు శబ్దాలు అయినట్టూ,
స్త్రీలు మాత్రమే చెప్పగా పదాల మృత్యు జాడలు అయినట్టూ: అలా అని నువ్వు అన్నావు): ఆమె అంది:

"ఒకప్పుడు వేయి మర్మావయాలను ఉసిగొల్పిన ఆ ముఖం ఇప్పుడు ఏమయ్యింది?"



పరిపూర్ణంగా మధువుతో వివశితమయ్యి, ముఖంలేని ఒక స్వరంచే స్వప్నింపబడి, మనం
ఆ రాత్రి ఇంటికి ఎలా చేరుకున్నాం?

No comments:

Post a Comment