14 August 2010

అప్పటిదాకా

నన్ను నీ ప్రవాహంతో తీసుకు వెళ్ళు
ప్రశాంతమైన నీ రక్తపు చెలమలో
అతడిని విశ్రామించనివ్వు
నీ అస్తిత్వపు వర్షాసంధ్యాసమయంలో
గిరికీలు కొడుతున్న
పిచ్చుకల రెక్కల శబ్దాన్ని అందరూ విననివ్వు:
నన్ను కూడా కొన్నిసార్లు
మరి కొన్నిసార్లు
నిన్ను
నీ కలల మరో వైపుకి
నా కలల మరో వైపుకి
తీసుకువెళ్ళనివ్వు.

అప్పటిదాకా
ఆ క్షణందాకా
ఇద్దరు ముగ్గురయ్యి
ఒక్కటయ్యేదాక
నిన్ను
కల నుంచి కలకు పారాడే
ఒక ప్రేతాత్మలా చూసేందుకు
నన్ను రాత్రికి శిలువ వేసి ఉంచు.
దయచేసి
అప్పటిదాకా
అతడు
ఆమె ఆఖరి పదాల్ని లెక్కపెట్టే చోట

రాత్రుళ్లన్నిటికీ రాత్రయిన
నా రాతిరి మల్లెమొగ్గ

నన్ను శిలువ వేసి ఉంచు.
అప్పటిదాకా
ఇప్పటిదాకా.

No comments:

Post a Comment