09 August 2010

ఉన్నది ఉన్నట్టుగా

నేను అదే మంచంపై పడుకుని ఉండగా, నువ్వు మరొక స్త్రీతో
రమిస్తావు అదే మంచంపై:

గదంతా మసక వెలుతురు. గదంతా వర్షంతో తడిసిన వాసన.
గదంతా చెట్ల మొదట్లో రాలిన
ఎండిన ఆకులు విదుల్చుతున్న పచ్చి దేహపు వాసన.

కొద్దిసేపు క్రితం, వర్షించేందుకు రెండు మేఘాలు ఒకదాన్ని
మరొకటి ఒరుసుకున్నాయి. ఇప్పుడు
ఏ మేఘం బయట లక్ష కౌగిళ్ళతో రాలిపడుతుందో
నాకు తెలీదు.
కొద్దిసేపు క్రితం, నీ నగ్న దేహంపై ఇద్దరు స్త్రీలు రెండు నల్లటి
అశ్వాలయి దౌడు తీసారు
ఇప్పుడు, ఒక స్త్రీ, కళ్ళలో మెరుస్తున్న లక్ష మెరుపుల
ఉద్యానవనాలతో నీ కింద కదులాడుతుంది.
మరొక స్త్రీ నీ పక్కగా కదలకుండా కూర్చుని, రెండు శరీరాల
వాసన కలగలిసిన నీ దేహం వైపు చూస్తుంది.

నీ దేహం ఎవరిది? నగ్నంగా కంపిస్తున్న నా దేహం
ఎవరిది?
వర్షం వెలిసి, కిటికీ పక్కగా గదిపై నుంచి పడుతున్న ధార.
ఇక నీ రెండు చేతుల్నీ చాచి
ఆమె దేహం నుంచి పక్కకు జరిగి, నన్ను నీ దేహంలోకి
లాక్కుంటావు.

ఇది ఏమిటి? నేను అడుగుతాను.
ఇది ప్రేమ. నువ్వు అంటావు. మళ్ళా వర్షం మొదలవుతుంది.
నేను నాది కాని దేహాన్ని నా దేహంలోకి తీసుకుంటుండగా
అదే మంచంపై పడుకుని ఉన్న స్త్రీ
అదే మంచంపై నువ్వు మరొకరితో రమిస్తుండగా కలలో
మాట్లాడుతుంది: "నువ్వు
ఇదే మంచంపై పడుకుని ఉండగా నేను
ఇదే మంచంపై మరొక పురుషుడితో రమిస్తాను స్వేచ్చగా,
అది కూడా ప్రేమ. "

No comments:

Post a Comment