మీరు ఇంత కాలం తిరుగాడిన ఈ ఉద్యానవనాన్ని మీరు వోదిలివేసి వెళ్ళినప్పుడు
ఒక తోటమాలి మీరు అతడి అస్తిత్వంలో వొదిలివేసిన ఊపిరి పరిమళాల మధ్య,
తన అస్తిత్వపు రహస్య ఉద్యానవనంలో సంచరించేందుకు వస్తాడు.
లేకుండా ఉండి, తెమ్మెరలా, ప్రేమమయపు గుసగుసలా ఇంకా కదులాడేది ఎవరు?
అతడి పేరుని ఇప్పటికీ సంధ్యాసమయంలో పిలిచి
అతడిని రాత్రిపూట మృదువుగా తాకేది ఎవరు? అతడి నిదురగానూ స్వప్నంగానూ,
అతడు శ్వాసించే గాలిగానూ, అతడు మననం చేసుకునే
ప్రార్థనగానూ, అతడిని తీసుకు వెళ్ళిన నదిగానూ, నది ఒడ్డుగానూ మారినది ఎవరు?
మీరు ఇంతకాలం, అంచుల దాకా నింపిన ఈ అంతర్గత ఉద్యానవనాన్ని వొదిలి వెళ్ళినప్పుడు
ఒక తోటమాలి నేలపై రాలిన వడలిపోయిన పూలను ఏరుకునేందుకు వస్తాడు.
తల్లి లేని పూవులూ గూళ్ళులేని రెమ్మలూ. ఒక తోటమాలి తన శిరస్సుకుపైగా గుమికూడిన
నల్లటి మేఘాలతో సంభాషిస్తూ రోదిస్తాడు. వెడలిపోయే గాలులని
తిరిగి రమ్మని బ్రతిమిలాడుకుంటాడు. మోకాళ్ళపై వేదనతో ఒరిగిపోయి ఎక్కిళ్ళు నిండిన
స్వరంతో ఒక జవాబుకి విలవిలలాడతాడు:
ఇది తీసుకో: నువ్వే అయిన దీనిని: నువ్వు. నువ్వే అయిన నేనుని.
మొహసింతో, వాళ్ళు వెడలిపోయినప్పుడు, వాళ్ళు నిన్ను వొదిలివేసి వెళ్లిపోయినప్పుడూ,
నిన్ను నువ్వు ఒక అద్దంలో చూసుకునేందుకు తిరిగి వస్తావు. మట్టిలో
ఆమె వొదిలివెళ్ళిన పాదముద్రలని వెంబడిస్తూ,జ్వలిస్తున్న మొగ్గల స్వరాలని వింటూ
నువ్వు పూవులు రాళ్ళనీ, ముళ్ళు పూవులనీ తెలుసుకునేందుకు వస్తావు.
పిల్లలు, గాలిలో వర్షంలో వికసించే పూలగీతాలనీ గ్రహించేందుకు వస్తావు .
మొహసింతో నువ్వు గాలివా? లేక ఒక జ్ఞాపకాన్ని మాత్రం వొదిలివెళ్ళిన ఒక వర్షానివా?
మొహసింతో నువ్వు వెడలిపోయినప్పుడు,
నువ్వు వృక్షాలూ గాలుల జ్ఞాపకాల గురించి మాట్లాడుతూ మిగిలిపోయే ఒంటరివా?
లేక, అస్తిత్వపు తపనని వొదిలివెళ్ళే జ్ఞాపకపు చిహ్నానివా?
మొహసింతో, మనం జీవించి ఉన్నామా మరణించి ఉన్నామా? మన జీవితాంగానూ,
మన అస్తిత్వాలగానూ మారి మనల్ని అంతంలేని
కలల వీధులలోంచి మనల్ని పిలిచేది ఎవరు?
ఒక తోటమాలి వచ్చినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు, ప్రతి ఒక్కారూ ఒక ఊరేగింపులో
వచ్చి వెళ్లిపోతున్నప్పుడూ,మొహసింతో, మనల్ని బ్రతికించేది ఎవరు?
మనల్ని బ్రతికిస్తూ చనిపోతున్నది ఎవరు? పూలదారుల గురించీ, పూలను నలిపివేసే
దారులగురించీ చెప్పగలిగేది ఎవరు? జీవించేది ఎవరు, మరణించేది ఎవరు?
వెడలిపోయేది ఎవరు, త్యాగం చేస్తూ మిగిలిపోయేది ఎవరు?
మీరందరూ ఈ లోపలి ఉద్యానవనాన్ని ఒదిలి వెళ్ళినప్పుడు, ఒక తోటమాలి
మీరు ఇంతకాలం తెంపుకున్న పూల గురించి విలపించెందుకు వస్తాడు. ప్రతి పూలరేకూ
నీ లేనితనపు ఒక పద చిహ్నం. ప్రతి పదం
ఎప్పటికీ ఉండే నువ్వు లేనితనపు వెంటాడే సంజ్ఞా. ప్రభూ,ఒక తల్లి ఖాళీ గర్భంవంటి
అరచేతులతో, ఒక తండ్రి నిండైన నిశ్శబ్దంలాంటి బాధతో, వేదనతో, ఇతరుని దు:ఖంతో,
ఒక తోటమాలి ఇక ఎప్పటికీ, ఒక తల్లి యొక్క తండ్రి లేనితనాన్నీ
ఒక తండ్రి యొక్క తల్లితనాన్నీ, తల్లిలేనితనాన్నీ వెదుకుతాడు.
Amen.
No comments:
Post a Comment