తరచూ ఏం జరుగుతుందంటే
నువ్వు మనుషుల్ని రాళ్లగా మార్చే విద్యలో
రాటుదేలావు
తరచూ ఏం జరుగుతుందంటే
తరచూ నువ్వు గ్రహించనిదేమిటంటే
ఆ రాళ్ళు నిన్ను ప్రేమించిన మనుషులు, వాళ్ళు
నువ్వు ఒకప్పుడు శ్వాసించిన పూవులు
రాత్రిలో నీ చుట్టూ
వెచ్చగా తిరుగాడిన మిణుగురులు. అన్నిటికంటే
తరచూ ఏం జరుగుతుందంటే
ఆ రాళ్ళకు హృదయాలున్నాయి
అచ్చు నీ హస్తాలలాంటి చేతులతోనే
నిన్ను కౌగాలించుకుంటాయి
అచ్చు నీ పెదాలలాంటి కనులతోనే
నిన్ను ముద్దాడతాయి
నీ పాదాలలాంటి నడకతోనే
నీ భారాన్ని తమపై తీసుకుని
నిన్ను నువ్వు వెళ్ళాల్సిన దూరాలకి చేరుస్తాయి
అదేమిటంటే
తరచూ ఏం జరుగుతుందంటే
నువ్వు మనుషులను రాళ్లగా మార్చి, రాళ్ళను
తిరిగి దూళిగా మార్చే కళలో
సమగ్రమైన నైపుణ్యాన్ని సాధించావు
ఊరికినే అలా.
No comments:
Post a Comment