30 December 2010

నువ్వు వెళ్ళిపోయినప్పుడు

నువ్వు వెళ్ళిపోయినప్పుడు
ఎలా వెళ్ళిపోయావు?

ఈ లోకానికి మరో వైపు
ఎదురు చూస్తూనే
ఉండి ఉంటారు నీకోసం కొందరు
మంచు కప్పిన
వెన్నెలలో, ఆ పచ్చిక మైదానాలలో
లాంతరుతో
మరో వైపు మాత్రమే జీవించిన
నీ లోకంలో
ఎదురు చూస్తూనే
ఉండి ఉంటారు నీకోసం కొందరు

నువ్వు జీవితాంతం
వెదుకులాడుకున్న ఆ కొందరు
ఆ అందరూ =

నువ్వు వెళ్ళిపోయినప్పుడు
నీ వెంట
కొంత నీలి నింగి ఆకాశాన్నీ
కొంత నీలి కళ్ళతో
తడిచిన పదాలనీ
కొంత మరుపునీ
కొంత మత్తునీ
పదిలంగా దాచుకునే
వెళ్లి ఉంటావు=

కొందరితో విసిగి
అందరికై వెళ్ళిన వాడివి
అక్కడ
ఆ అక్కడ
అందరూ కొందరయ్యే చోట
కొందరు ఒక్కరయ్యే చోట
అక్కడ నుంచి
ఇక్కడికి
నువ్వు చెప్పలేకపోయిన
పదాలని పంపివ్వు
కొంత మత్తుతో
కొంత పరవశంతో

మేము వెళ్లిపోతున్నప్పుడు
ఎలా వెళ్లిపోతామో
నీ స్వరాలతో చెప్పుకుంటూ వస్తాము=

4 comments:

  1. గుడిహాళం మరణం మీద వ్రాసినదా? కవితలో ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. అది ఏమిటో తెలియటం లేదు.

    ReplyDelete
  2. "నువ్వు వెళ్ళిపోయినప్పుడు | నీ వెంట కొంత నీలి నింగి ఆకాశాన్నీ | కొంత నీలి కళ్ళతో తడిచిన పదాలనీ | కొంత మరుపునీ | కొంత మత్తునీ |
    పదిలంగా దాచుకునే | వెళ్లి ఉంటావు"

    అద్భుతం...!!

    ReplyDelete
  3. సరళంగా, అర్థం అయ్యేటట్టు బావుంది. ఎందుకిలా వ్రాయరు ప్రతీసారి?

    ReplyDelete