16 May 2021

మధ్యాహ్నపు అమ్మ

 మధ్యాహ్నపు అమ్మ

__________________________

నల్లటి నీడలు తెల్లటి నీటి పాయల్లా తన వేళ్ళ చివర కదులుతుండగా
నేను అమ్మ మధ్యాహ్నం దుస్తులు ఉతకడాన్ని చూస్తాను
ఇంటి వెనుక జామ చెట్టు వృద్ధాప్యంతో వొంగి , జ్ఞాపకాలలో కోల్పోయిన తనని చూస్తుండగా
నేను అమ్మ మధ్యాహ్నం దుస్తులు ఉతకడాన్ని చూస్తాను

మరెక్కడో మరొక వృద్ధుడు, అలల్ని అరచేతిలో పట్టుకుని వాటిని పిట్టల్లా మార్చే
తన మనవరాల్ని చూసేందుకు సముద్రంలోకి వెడుతుండగా
మరెక్కడికో వెళ్ళలేని ఇక్కడి అమ్మ ఇక్కడే మౌనంగా దుస్తుల్ని నీటిలో ముంచుతుంది
తన ప్రియుడికి ఎన్నటికీ తిరిగి ఇవ్వలేని పుస్తకంలో రంగు మారిన రావి ఆకులా
అమ్మ దుస్తుల్ని తన ముందు పరుచుకుని, తన రెండు హస్తాలతో

అప్పుడే జన్మించిన శిశువుని తుడిచినట్టు, మరణించిన తన తల్లితండ్రుల శరీరాల్ని
శ్మశానానికి తీసుకువెళ్ళే ముందు, ప్రేమతో బాధతో నిశ్శబ్దంగా కడిగినట్టు
అమ్మ దుస్తుల్ని తన ముందు పరచుకుని, తన రెండు హస్తాలతో వాటిని శుభ్రం చేస్తుంది

అమ్మ మధ్యాహ్నం ఒంటరిగా దుస్తుల్ని ఉతుకుతుంది
తనని వొంటరిగా వదిలివేసిన వాళ్ళ దుస్తుల్నీ, తనని ఇక్కడ ఒంటరిగా వదిలివేసి
మరెక్కడో తన అస్తిత్వపు ఊసైనా లేక కదులాడుతున్న వాళ్ళ దుస్తుల్నీ
అమ్మ మధ్యాహ్నం ఒంటరిగా శుభ్రం చేస్తుంది
మరుపైనా లేని సమయంలో, ప్రేమించినవాళ్ళకీ కోల్పోయినవాళ్ళకీ 
తేడా లేని సమయంలో, అమ్మ
ప్రేమించిన వాళ్ళ దుస్తులనీ, ప్రేమించలేని వాళ్ళ దుస్తులనీ నీటిలో 

ముంచుతుంది. వాళ్ళ చొక్కల్నీ, పాంట్లనీ, లోదుస్తులనీ ఒకదాని తరువాత మరొకటి 
శుభ్రం చేస్తూ, నుదిటిపై చిట్లిన 
చెమటను తుడుచుకునేందుకు క్షణకాలం ఆగుతుంది

సరిగ్గా ఆ క్షణాన వొంటరి మధ్యాన్నం స్రవించే నెత్తురు గులాబీగా మారుతుంది
సరిగా ఆ క్షణాన ఆకాశపు తీగపై ఆరవేసిన మేఘాలు పచ్చి గాయాలుగా మారతాయి
సరిగ్గా ఆ క్షణాన అమ్మ గర్భంలో ఈ కవిత ఊపిరి పోసుకుంటుంది

సరిగా ఆ క్షణాన అమ్మ శరీరంలో ఒక దిగులు గీతం కదులాడుతుంది. ఆ తరువాత
అప్పుడే ఆర్పివేయబడ్డ ప్రమిదెలు 
వెలుతురు వాసనను గాలిలో వదిలినట్టు, అమ్మ దుస్తుల్ని ఉతకడం పూర్తిచేసి, 

వర్షానికీ బాధకీ వాటిని వోదిలివేసి ఇంటిలోకి వెళ్ళిపోతుంది.

No comments:

Post a Comment