ఇక ఈ రాత్రి ఇక్కడ విశ్రమిస్తాను. ఎంటువంటి ఆరోపణలూ లేకుండా ఇక ఈ
రాత్రి అస్తిత్వాన్ని అంగీకరించి
శిరస్సుని ధూళి నిండిన పాదాల వద్ద ఆన్చి నిలిచిపోతాను
కనిపించని ఉనికి ఏదో
నిర్దేశించిన దారి ఇది. క్షణక్షణం రహస్య స్వరం ఏదో రమ్మని పిలిచిన కరుణ లేని దారి ఇది. సమయపు సంకేతాల్ని
అనువదించుకునేందుకు గులాబీలను
వొదిలి ముళ్ళను హృదయంలో దింపుకున్న అంతులేని తపన ఇది
ఇక ఈ రాత్రి ఏది ఏమిటని
అడగను. ఇక ఈ రాత్రి ఎవరు ఎవరనీ అడగను
జీవితాన్ని వెదుకుతూ
జీవితాన్ని కోల్పోయాను. అర్థాన్ని వెదుకుతూ అర్థాన్నీ కోల్పోయాను. ఉండేందుకు, ఏమీ కోరని ఈ భూమిపై అలా ఉండేందుకు అనేక పర్యాయాలు మరణించాను. తిరిగి చేరుకునేందుకు, ఎప్పటికీ చేరుకోలేనంత దూరమూ వెళ్ళిపోయాను. తుంపులు తుంపులుగా నలుదిశలూ వీడిపోయాను
ఇక ఈ ఒక్క రాత్రి, మట్టిని రక్తపు పెదాలతో ముద్దాడే పాదాలు నావి, అవి చేసే అలికిడి ఎవరిది అని అడగను. శూన్యపు కాంతిని వలలై
చుట్టుకునే కనులు నావి, అవి చూసే చూపు ఎవరిది అని అడగను. ఇక్కడ ఈ గాలిలో వికసించిన
అస్తిత్వపు పూవు నాది, దాని ఎరుక ఎవరిది అని అడగను. విరిగిపోయాను. పూర్వీకుల ధూళిలో కలసిపోయాను.
అలసిపోయాను. ఇక ఎటువంటి ఆరోపణలూ
లేకుండా ఈ రాత్రి జీవితాన్ని అంగీకరించి శిరస్సుని వడలిపోయిన పాదాల వద్ద ఆన్చుకుని ఇక్కడే
ఆగిపోతాను. ఇక ఇక్కడే,
No comments:
Post a Comment