07 December 2016

స్పృహ

రాత్రి ఎప్పుడో, మ్రాగన్ను నిద్రలో నువ్వు
నా గుండెల మీద తల ఆన్చితే
ముసురు చీకట్లలో అవిసె చెట్లు వొణికిన
జ్ఞాపకం: హోరున వీచిన గాలికి

ఆకులు రాలి, వెన్నెల చెదిరి, అలలపై
మరోవైపుకు తేలిపోతే, నీ చిక్కటి
కురుల కింది కళ్ళల్లో, పండిన గోరింట
వాసన. ఛాతిపై ఒక గాటు: చెమ్మ -

రాత్రుల కలవరింత. బ్రతికి ఉన్నాననే
స్పృహ. కానా తరువాతే ఎందుకో
నీ తల అనిన చోట, వలయాలు ఏర్పడి
హృదయం పునర్యానమయ్యే వేళ

రాత్రే ఎక్కడో, దారి తప్పిపోయింది!

1 comment:

  1. ముసురు చీకట్లలో అవిసె చెట్లు వొణికిన
    జ్ఞాపకం...రాత్రుల కలవరింత. బ్రతికి ఉన్నాననే
    స్పృహ // కలల జీవితాన కలవరింతల జ్ఞాపకాలు

    ReplyDelete