30 August 2016

అమ్మాయీ

అమ్మాయీ
ఎంతో కాంతి నీ ముఖంలో -
కొంగలు ఎగిరే సరస్సులు నీ కళ్ళల్లో -
ఊగే చెట్లూ, గాలీ
నీ మాటల్లో!

అమ్మాయీ
దిక్కూ మొక్కూ లేని పక్షులు
చేరే గూళ్ళా అవి, నీ పల్చటి చేతుల్లో?
రాత్రి నవ్వులా అవి
చుక్కలు

చినుకులై
మెరిసే నీ తనువులో? అంతిమ
మృత్యువేనా అది, లాలనగా పిలిచే
నీ ఒడిలో? జీవన జోల
పాటేనా అది
నీలో?

నాలో?
***
అమ్మాయీ
ఎంత కాంతి, నీ ముఖంలో!
ఎంత శాంతి , నీలో!

ఎంత కాంతీ, శాంతీ
నిన్ను చూసిన ఆ క్షణంలో!
ఆ కృతజ్ఞతలో!

No comments:

Post a Comment