25 August 2016

వాన

వాన పడుతున్నది. నడి దినం మసక చీకట్లలో చిక్కుకుని ఉన్నది. గూడు చెదిరి ఒక పావురం నిలిచిన నీళ్ళల్లో అలజడిగా కదులుతున్నది. జలజలా ఆకులు రాలి, నేల వొణుకుతున్నది. గాలికీ, చినుకులకీ భీతిల్లి ఒక పాప చెట్టు కింద ఆగి ఉన్నది. నీటి ధారకి పాదాల కింది మట్టి జారి పోవుచున్నది. ఏమీ తోచకున్నది. హృదయమొక పావురమై, ఆకులు రాలిన నేలై, పాపై, తడిచిన కాగితమై బెంగటిల్లి దిక్కు తోచక అటూ ఇటూ తల్లడిల్లుచున్నది. నలు దిక్కులలోకీ ఏదో లాగుచున్నది. తిరిగి మరల లేనంతగా, ఏదో పిలుచు చున్నది. ఎటుల బయటపడుటనో తెలియకున్నది -

బయట వాన పడుతున్నది. గూడు లేకున్నది. రెక్కలు తడిచి ఉన్నవి. చీకట్లు ముసురుకుని ఉన్నవి. దారి తెలియకున్నది. దీపం వెలుగక, ఎవరూ కాన రాక, లోన దిగులుతో, పావురమింకా తచ్చాట్లాడూతూనే ఉన్నది. తల్లి లేక, రాక, చెట్టు కింద, కాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని పావురం కళ్ళతో, ముడుచుకుని పాప వాలిపోయి ఉన్నది. దారులన్నీ సోలి ఉన్నవి. పూవులన్నీ రాలి ఉన్నవి. ఊపిరిని ముడి వేసి బిగించినట్టూ, హృదయాన్ని నులిమినట్టూ

ఇంకా లోన వాన పడుతూనే ఉన్నది. గూటికి దారి ఏటో, గూడు ఉన్నదో లేదో కూడా తెలియకున్నది. ఆగక ఇంకా, ఇంకా, ఇంకా - వాన పడుతూనే ఉన్నది. నువ్వై వాన కుండపోతగా కురుస్తూనే ఉన్నది!

No comments:

Post a Comment