09 August 2016

పిల్లి

రాత్రి ఒక పిల్లి పిల్ల వచ్చింది, ఎక్కడినుంచో. కిటికీలోంచి లోపలికి చూస్తూ మ్యావ్మంటో - పాలు పోసినా త్రాగక, నావైపే చూస్తో: నీకు పిల్లి భాష ఏమైనా తెలుసా? అని అడిగింది ఓ అమ్మాయి ఒక మూల ముడుచుకుని కూర్చున్న నాతో

పిల్లులు ఎందుకు వస్తాయో, వాటికేం కావాలో అవి మాటిమాటికీ ఎందుకు మ్యావ్మంటాయో పాదాల చుట్టూతా ఎందుకు తిరుగుతాయో, అట్లా మిడి గుడ్లేసుకుని నిన్నే ఎందుకు చూస్తాయో నువ్వు విదిల్చి వేసినా, కసిరి కొట్టినా అన్నీ మరచి, మళ్ళీ నీ వెనుకెనుకే అట్లా ఎందుకు రుద్దుకుంటూ తిరుగుతాయో

అమ్మాయీ, ఎవరికి తెలుసు? వెళ్లి మరెవర్నైనా అడుగు. కిటికీలోంచి లోపలికి వచ్చి, పాలు త్రాగి ఒక మూల ముడుచుకుని పడుకుని, అర్ధనిమిలిత నేత్రాలతో నిన్నే చూసే, నన్ను మాత్రం నువ్వసలే అడగకు!

No comments:

Post a Comment