27 August 2016

బహుమతి

సాయంకాలపు నీడలూ, కాంతీ తన ముఖంలో -
కళ్ళేమో నానిన మొగ్గలు. ఒళ్లో
వొదిలేసిన చేతులేమో వడలిన కాడలు -
(నరాలు తేలి, పసుపుపచ్చగా
అవి) ఇక

తను చిన్నగా నడుం వాల్చి నుదిటిపై అరచేతిని
చిన్నగా వాల్చుకుని "నానీ, కాస్త
లైటు ఆర్పివేయి" అని లీలగా అంటే, బయట
ఉగ్గపట్టుకున్న రాత్రి కరిగింది -
అతి నెమ్మదిగా

గాలి వీచి, ధూళి రేగి, నేలపై ఆకులు దొర్లి, చీకటి
సవ్వడి చేసింది. తన శరీరంపైనుంచి
అలలా ఒక తెర ఏదో, తాకి వెళ్ళిపోయింది -
అలసట వదులవ్వుతూ, ఇక
మ్రాగన్నుగా తను

ఒక కలవరింత అయ్యింది. కంపించింది. ఆనక
ఆకులపై జారే మంచువోలె, తను
నిదుర ఒడ్డున ఒక గవ్వై ముడుచుకుపోయింది.
తెల్లని పావురమైపోయింది -
నిశ్శబ్ధమయ్యింది -

మరి అందుకే, నువ్వసలు మాట్లాడకు శ్రీకాంత్!
ఊహలోనైనా తనని కదపక, అలా
తనని తనతో ఉండనివ్వగలగడమే, నువ్వు
తనకి ఇవ్వగలిగిన, ఒక విలువైన
బహుమతి!

No comments:

Post a Comment