06 June 2016

మిగిలినది

అరవిచ్చిన మొగ్గల్లాంటి చిన్ని అరచేతులు, ఇక
నీ ముందు: 'ఏమిస్తావు?' అన్నట్లు -
***
ముఖమంతా వెన్నెల -
కళ్ళల్లో మిణుకుమనే చుక్కలు. పెదాలపై నవ్వు
రాత్రి వీచే గాలై -

విశ్వాన్ని దాచుకున్న
చిన్ని హృదయం. పలకా, బలపం అంతటి కాలం -
"ఎందుకు నాన్నా?"

అని, నిన్ను చుట్టుకుని
నీ అశ్రువులని, వేళ్ళ చివర్లతో తుడిపివేసే లోకం:
ఒక ఇంద్రజాలం -
***
వేలాడే గూళ్ళలాంటి చిన్ని చిన్ని అరచేతులు:
నిన్ను తమలోకి పొదుపుకుంటూ -
***
ద్వేషానిదేముంది?
ఎంతయినా వెదజల్లవచ్చు: ఈ లోకాన్ని తిరిగి ఓ
పాపాయిలా

నీ హృదయానికి హత్తుకోవడమే, నీకు ఇప్పుడు
తెలియాల్సి ఉందిక!

No comments:

Post a Comment