నీ అరిపాదాలు పగిలిపోయి ఉన్నాయి: ఆ పగుళ్ళల్లో మట్టి, నల్లటి గీతలయ్యి అరచేతి రేఖలయ్యీ -
***
ఒకప్పుడు, నా శిరస్సును వాటిపై వాల్చితే, అవి తెల్లని మబ్బులు. నడిచే గులాబీ మొగ్గలు. సీతాకోకచిలుకలు ఎగిరే సరస్సులు. ఒకప్పుడు అవి నవ్వే పసిపాపలు. వెన్నెల కురిసే మైదానాలు. తాకితే కందే మెత్తని స్వప్నాలు. వడివడిగా పారే మాటలు -
నేలపై వలయాలు గీసే మౌనాలు. ఎంతో ప్రేమగా ఎదురొచ్చే సాయంత్రాలు. చీకటిలో వెలిగే దీపాలు. గోరింటాకు పండిన రాత్రుళ్ళూ హత్తుకున్న రొమ్ములూ, అన్నం పెట్టిన చేతులూ నుదిటిన భవిష్యత్తుని లిఖించిన తడి వస్త్రాలూ అవి ఒకప్పుడు -
***
ఇకిప్పుడు, ఈ నగరంలో, ఈ రహదారిలో, ఆగిన వాహన రద్ధీలో, సిగ్నల్ వద్ద, తిండికి ఇన్ని రియల్ ఎస్టేట్ కరపత్రాలు పంచుకుంటూ పగిలిన పాదాలతో, కమిలిన కళ్ళతో, ముఖంతో నువ్వు -
***
పగుళ్ల మధ్య మట్టితో, ఆకాశం మబ్బు పట్టింది: లోపలేదో మసకగా మారింది. హోరున గాలి వీచి చెట్లు ఊగి , ధూళి ఎగిసి, ఏదో కురిసేందుకూ, పూర్తిగా తడిచి, విరిగి, వొణికిపోయేందుకూ, ఇంకా కొద్దిసేపే -
***
అందుకే, వర్షం పడక మునుపే, నా వాహనం వైపు నువ్వు రాక మునుపే, నువ్వు చూడక మునుపే చప్పున గేరు మార్చి, కారును తటాలున ముందుకు దూకిచ్చి, చెట్లు విదిల్చిన ఓ నిట్టూర్పుతో పారిపోయి, ఇకా రాత్రికి ఎక్కడో వొణికొణికి కురిస్తే...
***
ఏమీ లేదు: నగరం ఇది. ఏదీ తాకదు. కలవదు. హృదయమొక ఫ్లైఓవర్! అంతే -
beautiful
ReplyDelete