24 September 2016

జొనాథన్

జొనాథన్! ఓ జోనాథన్. చింతించకు -
గడిచిపోయాయి ఎన్నెన్నో వర్షపు రాత్రుళ్ళు ఇలాగే, ఆరుబయట గాలుల్లో చినుకుల్లో, మన లోపల వణికే ఆకులతో, తడిచిన మట్టి దారులతో, మూసివేసిన షట్టర్ల ముందు ముడుచుకుని తాగే బీడీలతో, హృదయంలో మెరిసే చుక్కలైన వాటి నిప్పుకణికెలతో, తూగే మత్తైన మన మసక మసక మాటలతో -

జోనాథన్, ఓ జోనాథన్ చింతించకు - 
గడచిపోయాయి యుగాలు ఎన్నెన్నో ఇల్లాగే, చీకట్లో గూటిలో మెసిలే తెల్లని పావురంలాంటి తన ముఖంకై వేచి చూసే ఫిరోజ్ లాగే, నీ లాగే, నాలాగే: బయటకి చెప్పుకోలేని మరెంతో మంది అనాధల్లాగే -

జోనాథన్! ఓ జోనాథన్. దా -
చింతించకు. ఉంది ఇన్నాళ్లూ నేను దాచిపెట్టుకున్న ఒక మధుదీపం. ఒక రహస్య పద్యం: తన చేతులతో, తన సువాసనతో, తానే అయిన వెచ్చదనంతో, మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని ఒక వలయపు కాంతిలో సృష్టినంతా అదుముకుని -

జోనాథన్, ఓ జోనాథన్. దా -
మరి, మన పూలలోగిళ్లలోకీ, గుహల్లోకీ, చీకటితో, స్మృతితో, మసక వెన్నెలతో, లతలు ఊగే బాల్కనీలలో కుండీలైన పిల్లలతో! మరి ఇక ఇంకేం కావాలి మనకి, జోనాథన్ ఓ జోనాథన్, వెన్నెల మంచుపొగై రాలే ఈ అర్థరాత్రికీ, ఈ చరణాలకీ, అర్థరాత్రిలో పుష్పించే ఈ మూగ సుమాలకీ?

No comments:

Post a Comment