27 September 2016

గురుతు

ఇంటికి వచ్చావు నువ్వు
ఎన్నో ఏళ్ళకి -
***
ఎండిపోయి ఉంది నేల -
సున్నం వెలసిపోయి
పగుళ్లిచ్చిన గోడ: లీలగా
ఊగే కర్టెన్లు, నీడలు -
పాతదే మంచం: నలిగిన
దుప్పటి: తల నూనె
మరకలతో దిండు. రాలి
తన తెల్లని శిరోజాలూ -
***
ఇంటికి వచ్చావు నువ్వు
ఎంతో కాలానికి -
***
మరి ఇక ఎందుకో కానీ

నిన్ను కావలించుకుని
బావురుమంది
ఒక తల్లి అప్పుడు!

2 comments: