26 September 2016

విను

వెళ్ళిపోకు, అని అన్నాడు అతను, ఆమెతో
చాలా చిన్నగా, నెమ్మదిగా -
***
వెళ్ళడానికి తను లేచినప్పుడు, ఒక్కసారిగా
ఆకులు జలదరించాయి -
కొమ్మల్లోంచి పక్షులు లేచాయి. ధూళి ఎగిసి
అంతా అస్పష్టం అయ్యింది -
***
వెళ్ళిపోకు, అని అన్నాడు అతను, తనతోనే
చాలా చిన్నగా, నెమ్మదిగా -
***
ఇక ఆ తరువాత, అతని ఎదురుగా రాలిన
ఆకులు. హృదయంలో
వాటి ఖాళీ సవ్వడి. పక్కగా, అట్లా వాలిన
(మరి అతనిదే అయిన)

రాత్రిలాంటి, బిక్షపాత్రలాంటి, నీడలాంటి
ఒక ఒంటరి అరచేయి!

No comments:

Post a Comment