వెడుతున్నాను/ ఎక్కడికి? / నిద్ర దగ్గరికి / అప్పుడే? / ఊ / ఎట్లా? / నవ్వుతో / అవునా? / అవును. నిద్ర నవ్వింది / నిద్రా నువ్వూ ఎప్పుడు ఒకటి అయ్యారు?/ నిద్రలో ఎవరో నవ్వినప్పుడు / అప్పుడు ఏమయ్యింది?/ ఒక దీపం వెలిగింది, ఆ వెలుతురు పూల వాసన వేసింది /ఆహా, ఇంకా ఏం జరిగింది?/ పూల పరిమళంలోకి ఒక పిట్ట వచ్చి వాలింది/ ఊ, ఆ తరువాత?/ పిట్ట హృదయం మబ్బు వలే మసకేసింది, గాలి వోలె ఊగింది, ఆడింది, పాడింది /ఇంకా?/ ఓ ఊయలలోకి అది చినుకువలే, కునుకు వలే జారింది/ ఊ, ఆ తరువాత? అప్పుడు ఇంకా ఏవైంది?/ చుక్కలతో చినుకులతో, వెన్నెలంత దయతో ఒక సీతాకోకచిలుక నా అరచేతుల్లో నిదుర పోయింది/ మరి నిదురలో ఏం జరిగింది?/ నిదురలో, కలలలో, కలల రంగుల్లో, రంగుల నీడల్లో ఒక జీవితం గడచిపోయింది/ ఆ తరువాత?/ వాన కురిసింది, గూడు తడచింది, అరచేతుల మధ్య చీకటిని ఓపలేక ఒక పూవు ఎగిరిపోయింది/ ఉఫ్ఫ్ ... మరి పిట్ట ఏమయ్యింది?/ రాత్రిలో, పూలు లేని చీకట్లలో, తన రెక్కలతో ఎవరికీ ఏమీ వ్రాయలేక, గొంతు పెగలక, తనలో తాను కూరుకుపోయింది/ ఇక ఎగురలేక, కింద పడి, రాలిన ఆకుల మధ్య చనిపోయింది/అయ్యో! ఆ తరువాత? ఆ తరువాత ఏమయ్యింది?/ వెడుతున్నాను/ ఎక్కడికి?/ నిద్రలోకి/ అప్పుడే?/ ఊ/ ఎట్లా?/ మట్టిలోకి ఇంకిన ముదురు వర్ణపు ఆకుల అలజడితో/ పీలికలైన గూటితో/ చుట్టూ రాలిన ఈకలతో/ మబ్బుల్లోకీ, నేలలోకీ/ నీతో, నాతో, తనతో, తిరిగి రాలేని ఒక చోటులోకి, నిద్రలోంచి నిద్రలోకి/ కలలోంచి కలలోకి/ ఇట్లా/ఇట్లిట్లా/ఎప్పటిలా ...
No comments:
Post a Comment