10 May 2016

ఊయల

పూలపూల పాత చీరలతో ఒక ఊయల చేసి, తాడుతో
వేలాడదీసి, కూర్చున్నారు ఇద్దరూ
వెలిగించిన ఒక దీపం ముందు -
***
రాత్రి. సన్నగా వీచే గాలి. ఆరుబయట, ఆకాశంలో
మిణుకు మిణుకు మనే చుక్కలు
ఊగుతూ మొక్కలు: నెమ్మదిగా -

ఇంటి ముందు చల్లిన నీళ్ళు. వేసిన ముగ్గు, చీకట్లో
ఒక కాంతి కిరణంమైతే, ఇక ఏవో
మాటలు, చిట్లే చినుకులలాగా -

చెట్లల్లో నిశ్శబ్ధం. ఇక, గూళ్ళల్లో ముడుచుకుపోయిన
పక్షులూ, రెపరెపలాడే ఆకులూ
తుంపరా: తన కళ్ళల్లో, కలల్లో -

చిన్నగా కళ్ళు తుడుచుకుని, తను ఏదో చెప్పేలోపల
అతను అంటాడు: "తిందామా ఇక?
మళ్ళా ఉదయాన్నే వెళ్ళాలి మనం"
***
పాత చీరలతో చేసిన ఊయల ముందు, వడలిపోయి
అట్లా పడుకుండిపోయారు ఇద్దరూ
నేలపై, ఆరిపోయిన ఒక దీపంతో -
***
ఇక హోరెత్తించే ఓ ఖాళీ గాలి, పూలు లేని ఊయలను
అట్లా ఊపుతూనే ఉంది ఆ రాత్రంతా
చినుకులతో, కళ్ళ కింది చుక్కలతో!

No comments:

Post a Comment