21 December 2012

రాలేను నీ వద్దకి

1
రాలేను నీ వద్దకి
2
నీళ్ళని చీల్చే పాదాలూ, ఎదురీదీ నిర్మలంగా వెళ్ళే కళ్ళూ నీవి
అలా ఎదురు చూడకు
ఓ దీపం అంటిన చీకటి

మెరుస్తోంది ఇక్కడ. నీ వద్దకు రాలేని ఈ గోడలపై, నిలువెత్తు
నీడలై. నేనై. నా
2
ముఖాన్ని దాచలేని నీ వద్ద - గ్రహించు- రాలేను - నీ వద్దకి
4
కానీ శరీరాన్ని వొలిచి, వెలుపలికి మలచి
బల్లపై ఒక కూజావలే, ఒక పూలపాత్ర వలే ఉంచి వినమ్రతగా
తప్పుకోగలను: ఊయలలూపే నీ చేతులు

క్షణకాలం ఆగిన చోట నుంచి-
క్షణకాలం ఊపిరీ తనని తాను
మరచిన ఆ చోట నుంచి. ఒక

గాలి కిటికీలోంచి పాకి, లతల వలే నీ నుదిటిపై శిరోజాలను
చెరిపే ఇద్రజాలం నుంచీ. మరి
అక్కడే నా
5
ఆత్మనీ దాచలేను. కుటీరం, ఆ గది. ఆ పచ్చిబాలింత వాసనా
నా ఆత్మ తొలి పయనాన్ని గుర్తు చేసిన నీ మదీ

ఒక నీరెండా ఒక పసరు తోటా ఒక చల్లని గాలీ
ఇక్కడిది కాని జీవితాన్ని, మృత్యుస్మరణ వలే
దిగంతాల పరిమళంవలే

అద్రుశ్యాకార ధూపం వలే
శరీరం లోంచి శరీరం లోకి
చొచ్చుకుపోయిన రాత్రి, ఆ ధరిత్రీ ఆ వెన్నెల గానాల సౌమిత్రీ
అందుకే, ఇప్పటికీ
6
నా అరచేతుల్లో పాల బరువుతో ఒదిగిన నీ పాలిండ్ల వొత్తిడి-
తల్లిదనం నిండైన ముఖమై
శరీరం నిండిన బరువై, ఒక

దివ్యమైన గుబురు పూలపొద యేదో రెండు చేతుల మధ్య
ఒదిగిపోయినట్టూ, పురివిప్పిన ఓ నెమలి తిరిగి నెమ్మదిగా
ముడుచుకుంటున్నట్టూ, నా

శరీరమంతా ఒక త్రండ్రితనం.
ఎవరివో లేత పసివేళ్ళు బుగ్గలపై పారడిన ఒక గగుర్పాటు
ఏదో ఒక కేంద్రం లోపల చిట్లి
శరీరమంతా కాంతి ద్రవమై నిండిపోతున్న తడబాటు. చీకట్లో

నాది కాని లోకంలో ఎవరో
ఒక దీపాన్ని వెలిగిస్తే కానీ
7
నీ వద్దకి రాలేని నగుబాటు: ఇక అందుకే, నీ రెండు వేళ్ళ మధ్యా
8
నులిమి, అంటించు ఈ ప్రాణపు వొత్తిని ఒక జ్వలనంతో విశ్వపు
శక్తితో: ఇక అప్పుడే, నక్షత్రాలు పూసే వేళ్ళల్లో
గ్రహాలు పేలి రంగులు వెదజల్లితే, వేణువొకటి

తిరిగి ప్రాణ వాయువుని ఊదే కాలాలలో, తిరిగి ఏడూ లోకాలూ
ఏడూ కాలాలూ నిర్మితమయ్యే పునర్యానంలో
వస్తానేమో, ఏమీ లేని ఏమీ కాని కాంతి కణాన్నై
9
మరి తొమ్మిది నెలలు మోసిన నీ వద్దకు
మరి తొమ్మిది జీవితాలు పంచుకున్న నీ
వద్దకూ

తలను వంచిన కృతజ్ఞతా పర్వంతో, తొలి మలి శాంతితో. మరి
అంతిమంగా నీతో. అస్థిత్వపు అంజలితో-           

No comments:

Post a Comment