20 December 2012

ఇలా.

ఎర్రటి ముద్ద మందారం విచ్చుకుంది నుదిటిలో-

ఎవరో నింపాదిగా కూర్చుని
బొగ్గులపై శరీరాన్ని కాలుస్తే

తడిపిన తువ్వాలుతో ఒళ్లంతా
తుడుచుకుంటున్నాను ఇలా.

ఎందుకో మరి, పలు కాలాల క్రితం, జబ్బుపడి
వీధి చివరన గోడకి ఆనుకుని
పుండునీ ఆ నెత్తురు చీమునీ

నాక్కుంటూ, వెళ్ళేవాళ్ళ వైపు దిగులు కళ్ళతో
చూసే ఆ నల్లటి వీధి కుక్క
గుర్తుకువస్తుంది ఇప్పుడు.

ఎలా ఉన్నావు? అంటే ఇదిగో ఇలా, మంచాన
ఏవో నావైన గాయాల్ని అలా
నాక్కుంటూ కూర్చున్నాను.

మరి, నీకేమైనా అభ్యంతరమా?

No comments:

Post a Comment