01 December 2012

ఎలా?

ఆకాశాన్నంటే నల్లటి రెక్కలు మొలుచుకు వచ్చి
     తలను వంచి, నీ రెండు చేతులతో, రెక్కలతో
     నిస్సహాయంగా మోకాళ్ళ మధ్య తలను దాచుకున్న మనిషిని

కమ్ముకుంటావు నువ్వు. అప్పుడు అతని తల కింది భూమి
     ఒక సప్తరంగుల శ్వేత వృత్త సమాధి. పరదాలు
     పరదాలుగా వీచే కాంతి రేణువులలో ఈ విశ్వం
 
అంతం లేని పూబంతుల చుట్టూ తిరిగే తుమ్మెదల
     ఝుంకారం. సర్వత్రా చీకటి వలలు మెలికెలు తిరిగే శక్తి సర్పాల
     ఆదిమ నాదం, ప్రణయం, ప్రళయం: అంతటా అంతం అయ్యి

మొదలూ చివరా అయ్యి మిగిలిపోయే, ఒక నువ్వూ
     ఒక నేనూ, ఎవరూ కానీ, ఎవరూ లేని ఒక చైతన్యం. ఇక్కడే
     ఒక ప్రాచీన జనన, మరణ నీటి బుడగల పరిమళం.

ఇంతటి రహస్య గర్భంలో, ఒడలు జలదరించే ఇంతటి
     బుద్బుధ మహా సౌందర్యంలో, సృష్టిని కలగన్నఅలసటతో
పొటమరించిన  ఒక దైవిక అశ్రువులో నన్ను

ఒక్కడినే వదిలివేసి ఇలా, ఎలా వెళ్లిపోగలవు నువ్వు?   

No comments:

Post a Comment