28 December 2012

వెన్నతో చేసిన రొట్టెలు

మేం చేసిన అల్లరికి చికాకొచ్చి, మా అరుపులకి విసుగొచ్చి, కోపంగా అరచి

     ఇక అప్పుడు కలుపుతావు కదా గోధుమ పిండిని చక్కగా నీ అరచేతులతో
     తలుపులోంచి చీకటి చల్లగా ఇంటిలోకి అలలుగా తరలి వచ్చే సమయానా
     మరి అప్పుడు కూర్చుంటాం నేనూ పిల్లలూ ఒద్దికగా బుద్ధిగా నీ ఎదురుగా
     బాసింపట్ట వేసుకుని, బళ్ళో  బెత్తంతో ఉన్న టీచర్ ముందున్న పిల్లల మల్లే
     చేతులు కట్టుకుని నువ్వు చూడనప్పుడల్లా ముసి ముసిగా నవ్వుకుంటూ-

పంట కాలవలేమో నీ అరచేతులు, మెత్తగా పిండిని వొత్తి, నీళ్ళు పోసి
     తిరిగి మళ్ళా కలిపి, ఎంతో ఇష్టంగా ఎంతో ఓపికగా, పూర్తిగా కలిసే దాకా
     అటు తిప్పి ఇటు తిప్పి, ముద్దను చేసి మళ్ళా విడదీసి, తిరిగి మళ్ళా కలుపుతూ
     నుదిటిన వాలిన జుత్తును ముంజేతితో వెనక్కి తోసుకుంటావు కదా, అప్పుడు
     నీ కళ్ళల్లో ఒక ఇంద్రధనుస్సు. నీ చుట్టూతా పచ్చిక మైదానాలపై ఎగిరే తూనీగలు.
     నీ శరీరం పై మెరిసే పసుపు పచ్చని పూవులు. ఇంతకాలం నమ్మలేదు కానీ

ఇప్పుడు నీ చేతుల్లో అలవోకగా కదిలే వెన్న కలిపిన ఆ పిండిని అలా గమనిస్తుంటే
     పార్వతి చేతుల్లో, గంధపు ముద్దతో రూపు దిద్దుకున్న ఆ పిల్లవాడి కధ నిజమే
     అనిపిస్తుంది: అందుకే మరి నీ చేతుల్లోని పిండి కూడా జీవం పోసుకుని, ఇక
     రొట్టేలయ్యీ చీకటి వేళ వెలుగయ్యీ  శ్వాసయ్యీ మేం నీకు చెప్పడం మరచిన

కృతజ్ఞతయ్యీ  ఇలా ప్రతి రాత్రీ మాకు ఇంత ప్రాణాన్నీ జీవధాతువునీ ప్రసాదిస్తాయి.
      అందుకే, తినబోయే ముందు ఇక తొలిసారిగా ప్రార్దిస్తాం నేనూ పిల్లలూ: నిన్ను.
      నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇంతసేపూ అబ్బురంగా చూసిన నీకు
      చివరికి మా దిష్టి కూడా తగలవద్దనీ, పిల్లలకే కాక నాకూ అమ్మవైన
     నిన్ను ఎన్నడూ విసిగించమనీ, నీకు ఎన్నడూ కోపం తెప్పించమనీ.                       

1 comment: