17 December 2012

వెన్నెల విడిచిన దారి


మీగడ పొరని తొలగించినట్టు, కన్నీటి పొరని మెత్తగా లేపి
    కళ్ళకి ఎవరో కాంతిని ప్రసాదించినట్టూ, మట్టిపొరలపై నుంచి
    వెళ్ళిపోతుందీ వెన్నెల: కొంత మసకగా, కొంత చల్లగా
    కొంత గాలిగా, కొంత నీడలా

గలగలలాడే ఆకుల చప్పుళ్ళలోంచీ, పొదలలో మెదిలే కప్పల
     పాదాల కింద నుంచీ, తేమై చెమ్మగిల్లిన పాత గోడల పగుళ్ళ
     లోంచీ, వంచిన తల ఎత్తితే, ఎదురుగా ఎవరూ కనిపించని
     అనంతమైన అరచేతుల దూరాలలోంచీ

కీచురాళ్ళ దిగంతాల వొంటరి అరుపులలోంచీ, రెపరెపలాడే
     ఊపిరి అంచున కదిలే ప్రమిదె మంట అంచు నుంచీ, అంచున
     దాగి ఉన్న హృదయాలలోంచీ, గుండెలో ఉగ్గపట్టుకున్న
     మాటలోంచీ, ఇక నువ్వు ఏమీ చెప్పలేని మౌనంలోంచీ

ఛాతి స్థానంలో ఒక చితిని ఏర్పరిచి, వెనుదిరిగి, తన శరీరంతో
    శరీరాన్ని అంటించి, వెనుదిరగి చూడకుండా వెళ్ళిపోతుందీ
     వెన్నెల: గుప్పిళ్ళ నిండా ఛితాభస్మాన్ని నింపుకొమ్మనీ
     నీ అస్థికలని నిన్నే ఏరుకొమ్మనీ, ఆనక వి/స్మృతి నదిలో
     కలుపుకొమ్మనీ

పాపం పుణ్యం శోకం శాపం గాయం గేయం దుక్కం దూరం
     ఏమీ అంటకుండా, భూమిని వొలుచుకుంటూ, నిరాకారమై
     నిర్లిప్తంగా వెళ్ళిపోతుందీ నీ నీలాల నీలి వెన్నెల. చూడు
     ఇక ఇక్కడ, కపాల వదనంతో, విరిగిన హృదయంలో

కాంతిరహితమైన చంద్రబింబం వంటి ఒక శూన్యపు కంతితో,
ప్రతిధ్వనించే ఒక రాత్రి ఊళవై మిగిలిపోయేదీ నువ్వే. వెళ్ళు.

- ఒక సమాధి తలుపు తెరుచుకుంటోంది నీకై, తన అద్దంలో-          

No comments:

Post a Comment