01 December 2012

పాపాయి

రహస్యంగా వెలిగిన గాలి, పూల వొత్తులను చిన్నగా కదిపినట్టు
     లేత మంటల ముద్రికలు, వెచ్చగా నీ ఛాతీపై పాపాయి తన వేళ్ళతో
     తాకినప్పుడు: ఇకీ లోకంలో నువ్వు అడుగిడగలిగే ఒక స్వర్గలోకం

అంటూ ఉంటే, నువ్వు తాకగలిగే
నిండా విరబూసిన ఓ ఆత్మవనం
అంటూ ఉంటే, శరీరానికావలగా నువ్వు చూడగలిగే కాంతి ప్రకంపనలు

అంటూ ఉంటే, చిగురాకుల భాషా, జనన
మరణాల రహస్య లిపి నువ్వు
చదవగలిగితే, వినగలిగితే...-

చూడు, అది ఇదే. కన్నీళ్ళతో చిప్పిల్లి
నవ్వుతున్న పాపాయి పెదాలపై ఒక

మహా వినమ్రతతో మోకరిల్లిన, అనాధ పిల్లలనుకున్న నీ అశ్రువులు-          

No comments:

Post a Comment