01 December 2012

సలహా

ఎదరువచ్చే వాళ్ళు ఎవరూ లేరు. అందుకే

అడుగుతావు నువ్వు ఏమిటీ రాత్రి అని ఈ
రాత్రిని దాటడం ఎలా, అని? ఇది మాత్రమే

చెబుతాను నేను నీకు: నీ కన్నీళ్ళలో ప్రతి
బింబించిన వెన్నెల ఇక్కడిది కాదు,ప్రతిగా
ప్రతిబింబించిన దూరం

నీది ఒక్కడిదే కాదు. కళ్ళ కింద ఇసుకా, మరి
బాహువుల్లో ఒక విస్ఫోటనమై
నిన్నూ, నీ మణికట్టునూ ఒక
సర్ప కోర వంటి కత్తి అంచుకు

నెట్టే, ఆ మహా ఒంటరితనమూ నీది కాదు.
ఆగు. లేతఎరుపు గులాబీ రంగులతో నిను

తొలిసారిగా ఉచ్చరించిన ఆ లేత పెదాలనీ
నాన్నా అన్న పిలుపునీ మరవకు. మనం
మళ్ళా మరొకసారి ఎత్తుకుంటాం
            
ఈ లోకపు శిశువుని మన పొత్తిళ్ళలో
మనం మళ్ళా ఒక జోలపాట పాడతాం
మలినమంటని ఈ కాలపు పాపాయినీ.

వేచి చూడు. మరణించకు. ఓడిపోకు. ఈ
ప్రమిదెలో నూనె పోసి, వొత్తిని వెలిగించి
రెండు అరచేతులూ అడ్డం పెట్టి మంచుకీ

గాలికీ, నిప్పు ఆరిపోకుండా చూసుకునే
భాధ్యతా, ప్రేమా మరి ఇక నీదే - కన్నా-.
ఉండు. ఊరికే అలా.

కొన్నిసార్లు రాయిగా ఎదురుచూడటం తప్పేమీ కాదు. 

No comments:

Post a Comment