12 December 2012

12-12-12

నీ తలను నరుక్కుని, బల్లపై ఉంచుకుని జాగ్రత్తగా పరికిస్తావ్

అందులో నీదైనదేదీ కనపడదు
చేతుల్లోకి తీసుకుని మోగిస్తావ్ 
అందులో నీదైనదేదీ వినపడదు 

ఇక కనురెప్పలను తెరిచి, కనుపాపలను చూస్తావ్.గాలికి   
రాలి గడ్డకట్టుకుపోయిన, పూవుల ప్రతి/బింబాలు మాత్రం 
ఉంటాయి అక్కడ, ఆ సమాధుల వద్ద. మరి 

ఇక నాసికను తాకుతావ్ చివరికి. 
గాలి లేని ధూళి పేరుకున్న తీరం 
ఉంటుంది అక్కడ, ఒడలు చిట్లిన చీకటి గాట్ల ఒంటరితనంతో-
మరి విరిగిన ఒక వేణువూ చివరి నెత్తురు చుక్కలూ అయిన

నీ కుత్తుకలో, నీ గొంతుకలలలో  
ఎవరివో బోలు శబ్ధాలు, ఎవరివో 
అసంఖ్యాక వాచకాలూ.అందులో 
నీదైనదీ, నీ నదీ ప్రవాహ మైనదీ

నీ అరచేతుల్లోకి తీసుకుని తాగగలిగే అమృతమేదీ కనపడదు-  

అందుకని
ఇకప్పుడు, నరుక్కున్న నీ తలను శుభ్రం చేసుకుని ఒక ఖాళీ 
పాత్రగా మార్చి మంచినీళ్ళతో నింపి 
నీ ఆవరణలోనే  పిచ్చుకలకు ఉంచి

మొండెం లేని శరీరంతో కూర్చుంటావ్, 12-12-12నాడు
ఆకుల నీడల మధ్యా, పాదాలని కోసే గాలి కాంతి మధ్యా

మరి అంతిమంగా నీ తల, ఈ 
జీవితంలో దేనికో, ఒక దానికి 

పనికి వచ్చింది కదా అని అనుకుంటూ  
నిన్నానుకుని కూర్చునున్న
ముఖం మాత్రమే కలిగివున్న 
శరీరంలేని ఓ స్త్రీ అశ్రువులని

నీ దోసిళ్ళలో కడు జాగ్రత్తగా
భద్రపరుచుకుంటో, ఏడేడు
కాలాలలో ఏడేడు లోకాలలో ఏరుకుంటో-

No comments:

Post a Comment