ప్రతి ఒక్కరూ, నవ్వుతూ ఇకిలింతలతో నీ తల వద్ద దీపం పెట్టే కాలమే ఇది జహాపనా
ఓపిక ఉన్నప్పుడే అల్లుకో ఓపికగా నీ నరాలతో ఇంతకాలం పోగేసుకుని దాచుకున్న కట్టెలను ఒక పాడెగా అవి నీ ఎముకలైనా సరే: పర్లేదు ఇతరుల అరచేతులెన్నడూ నువ్వు అనుకున్న అద్దాలూ ప్రతిబింబాలూ కాలేదు, నెత్తురు నిండిన బావులగా తప్ప. ఇక ఎప్పుడూ ఎందుకో మరి నీ ముఖమే అందులో నీ కళ్ళంత నీటిబొట్లై జారిపడి, ఇక పెదాలు ఒక ఉప్పు వనమై మిగిలిపోయి, హృదయంలో మొలిచే ముళ్ళ చెట్లల్లో ఒక చీకటి మంచు గాలీ ఆగకుండా - ఏం చేయగలవు నువ్వు అప్పుడు? అలసటగా ముంజేతిపై ఆన్చుకున్న నుదిటిపై ఓ తీతువు రెక్కలని సర్దుకుంటూ కూస్తున్నప్పుడు? మిణుగురులేవో నక్షత్రాలేవో తెలియనప్పుడు? సరే
తన కుత్తుకని చించుకునే తీతువు కంటే కంటే గొప్పవేమీ కావు, నువ్వు రాసుకునే పదాలు. తమకు అర్ధం కావని ఒక శ్వేతవస్త్రాన్ని కప్పి, నీ స్మృతి శిలాఫలకాన్ని ప్రతిష్టించి పవిత్రంగా వెళ్ళిపోయే ఇతరుల వాక్యాలూనూ. చూడు కమ్ముకున్న చీకట్లలో, అర విరిచిన వెన్నెలలో, ఒక స్వస్మశానం ఎదరు చూస్తుంది నీకోసం. ఇక నిన్ను నువ్వు భుజానికెత్తుకుని కదులు, రాం నామ్ సత్య హై, రాం నామ్ సత్య హై అంటో అనామకంగా అసత్యంగా
ఒట్టి నామవాచకాలుగా మారి దారికి ఇరువైపులా నిలబడి నిన్ను మౌనంగా చూసే ఈ లోకపు జనాల ప్రేతాత్మల సాక్షిగా- ఇక ఎవరు ఏమనుకుంటే నీకేం పాపం? నీకేం పుణ్యం?
ఒట్టి నామవాచకాలుగా మారి దారికి ఇరువైపులా నిలబడి నిన్ను మౌనంగా చూసే ఈ లోకపు జనాల ప్రేతాత్మల సాక్షిగా- ఇక ఎవరు ఏమనుకుంటే నీకేం పాపం? నీకేం పుణ్యం?
No comments:
Post a Comment