30 November 2012

నన్ను వెళ్లిపోనివ్వు

నిన్నేమీ అడగను. దారి కాయకు. ఇన్ని చుక్కలు
పూల గుత్తుల్లా వెలిగి ఇచ్చిన ఆ
కొద్ది మసక కాంతినీ కాజేయ్యకు:

రాత్రి ఇంకా బాకీ ఉంది. తోవ చేసుకుని తెల్లవారికి
చేరాల్సిన దారి ఇంకా మిగిలే ఉంది.ఇక
పుచ్చుకున్న లాంతరులో ఆఖరి కాంతి
మిణుకు మిణుకు మంటుంది. రివ్వున

నువ్వై విచ్చుకున్న చెట్లలోంచి ఒక పక్షి
ఎగిరేపోతుంది. నా కల చెదిరేపోతుంది-
నిన్నేమీ అడగను. నా నిదుర కాయకు

వెళ్ళిపోతాను, మంచు చెమ్మై అలసిన భూమిలోకి-

నన్ను వెళ్లిపోనివ్వు.   

No comments:

Post a Comment