30 November 2012

అగర్భం


అరవిచ్చిన బ్లేడు అంచున మెరిసి, అంచునంటి పెట్టుకుని
     కదులుతుంది ఒక వెన్నెల తీగ. నువ్వొక కవిత రాస్తూ 
     ఉన్నట్టయితే, దానిని నవ్వే నెలవంక అని ఉందువు-

వెదురు కుర్చీలో తనూ, ఎదురుగా తన పాదాల వద్ద నువ్వు.
     చీకట్లో అశోకా వృక్షాల వెనుకగా, ఆ వేసవి రాత్రిలో కమ్మగా
     పనస చెట్టు వాసన. తను కవయిత్రి కాదు: అందుకే 

జీరపోయిన గొంతుతో చెబుతుంది వాస్తవాన్ని: "Do you 
     smell that? That tree smells of Death. It smells of 
     our love. It smells of...". ఇక ఇరువురి పక్కగా ఆ 

అర్థరాత్రిలో దాదాపుగా శిధిలమయిన ఒక రమ్ బాటిల్.
     ఇంతకు మునుపే చెప్పాను మీకు, బకార్డీ రమ్ అని.
     అటు పక్కగా, నిన్నటి ఉదయం నుంచి తాగీ తాగీ, తాగీ 
     తిన్నవేవో కక్కిన ఆత్మ నెత్తురూ, ఈ జీవితపు మధువూ

ఆ నల్లటి పచ్చికలో. ఆ హాస్టల్ లాన్ లో. "మరి నాకు మెన్సెస్ 
     రాలేదు ఈ సారి. మరి ఏం చేద్దాం దానితో?" అని తను 
     యధాలాపంగా అడిగితే, నవ్వుతాను నేనిక అప్పటికే 
     ఛాతీపై కోసుకుని, ఎండుతున్న ఏడు కత్తి గాట్లని ఒత్తి

ఇంత నెత్తురు తడిని వేలితో నాలికపై రాసుకుంటో: రాత్రి 
     అంతే నింపాదిగా, ఆగి ఆగి చేమ్మగిల్లుతున్న గాటులా 
     తన గర్భంలోని పిండంలా నింపాదిగా నిలకడగా మరి 
     ఊపిరి పోసుకుంటుంది. దిగంతాలలో ఎక్కడో కానీ ఒక 

నిశ్శబ్ధ ఆక్రందన. గోడలపై నిర్విరామంగా పొడుగయ్యే నీడలు.
     తెరిచిన గది తలుపులోంచి, కిటికీ పైన కదిలే తోక తెగిన 
     బల్లి. కుత్తుక తెగినట్టు సుదూరంగా ఒక శునకమేదో---

తొలి వెలుతురు చినుకులు మట్టిని తాకేసరికి, ఇక మేం 
     ఒకరినొకరు గట్టిగా పట్టుకుని, ఎవరూ లేని వాళ్ళమై 
     వెక్కి వెక్కి ఏడ్చాం, గుండెలు చరుచుకుని నిండుగా 
     రోదించాం: ఒదలలేక, ఒదులుతూ తనే అంది: నానీ 
     నానీ, నువ్వంటే చాలా ఇష్టం కానీ..."అని. ఆ తరువాత

మరిక నాకే ఎప్పటికీ తెలియదు, ఆనాడు ఎందుకలా మేం 
     వెక్కి ఏడ్చామో, మరి ఇప్పటికీ అటువంటి రాత్రుళ్ళలో
     గర్భ స్రావమై చితికిన ఆ పిండాలు, ఇప్పటికీ ఈ తెల్లటి 

గోడలపై పసి శిశువుల నీడలై, మృత్యు పుష్పాలై నీ 
శరీరపు వాసనతో ఇంకా ఇక్కడ ఎందుకు 
లేత వేళ్ళతో నా కుత్తుకని నులుమి వేస్తూ 

ఎందుకు ఒక ఆదిమ బలిదానాన్ని గుర్తుకు తెస్తాయో.

( చదువుతున్నావా నువ్వు దీనిని? 
ఈ ఆగర్భ పురుషుడనైన నాతో? నీ)                 

No comments:

Post a Comment