20 November 2012

జణ గణ మన అంబానీ అను రిలయన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

శ్వేత సౌధం మీద కూర్చుని తప్పక అమ్ముకుంటావు
చివరికి నా ప్రాణవాయువునీ.

విపణిలో లబ్ధికై తప్పక ప్రచారం చేస్తావు
శీతలమైన అరలలో, గాలి అసలే ఆడని
పోట్లాలలోని, తాజా తల్లి పాల గుణాలనీ .

మరి
రైతులనీ, పంటలనీ సర్ధే పెడతావు
వరసగా అంగట్లో, తెల్లని వరసలలో

పల్చని పొరలని మా ముఖాలపై మృత్యువస్త్రం వలే కప్పి.

ఇక క్షురశాలలే పెడతావు దేశమంతటా
వీధి చివరి క్షురకుల నోళ్లల్లో మన్నే కొట్టి.
ఇక తాజాగా తాపీగా కట్టే, కుంటావు ఒక
పాలరాతి ఆకాశ హర్మ్యాన్ని పౌరులను పునాదులుగా పెట్టి.

ఇక
ఈ దేశపు చెవులలో, కనులలో అలాగే
పెడతావు ఒక పెద్ద తంత్రీ తంత్ర ప్రసార
మహా మాయా విషపుష్పాన్ని నీ
నిత్య వ్యాపార దండకాన్ని పటించి

హస్తాల కమలాల ముద్రికల తోడుగా, సాక్షిగా
నీ కంపనీ దుస్తులనే తొడుగుతావు మాకు
ముందుగా మమ్మల్ని పూర్తిగా నగ్నం చేసి
ఆపై మున్ముందు ఘనీభవించిన బాటిళ్ళలో
మా రక్తాన్నే మాకే అమ్ముతావు నిర్భీతిగా
మా ఈ శరీరపు బావులను మా ముందే తోడి:

 ఇక మిగిలి ఉంటే ఏమన్నా చివరికి
స్థనాలను కోల్పోయి తిరిగే స్త్రీలతో నీ
స్త్రీ ఆడుకునేందుకు హర్ష నృత్యాలే చేయిస్తావు
జూదపు క్రీడల ఐపిల్ మైదానాలలో జత కూడి-

అన్నా, అంబానీ - ఈ దేశపు సర్వాంతర్యామీ

నువ్వు కంకాళమయం చేసిన ఈ దేశానికి
చితి అంటించి, ఆ చితాభస్మాన్నీ పాకెట్లలో
పవిత్ర పుణ్య ప్రసాదంగా అమ్ముకోక మునుపు    

మిగిలి ఉందా ఇంకేమైనా, నా ఈ శరీరంపైనా
నా ఈ శరీరం లోపలా నువ్వు వ్యాపారం చేసి
తవ్వుకోనిదీ, తోడుకోనిదీ, వాడుకోనిదీ, వదులుకోనిదీ?  

10 comments: