23 November 2012

మన అమ్మలు

వాకిట్లో గోడకి జారగిలబడి, ఉదయపు ఎండలో
      జుత్తు చిక్కు తీసుకుంటూ ఒడిలోని తువ్వాలుపై దువ్వెనలో పేలను వెదుక్కునే
      ముసలి అమ్మలను చూసి ఉండవు నువ్వు ఎప్పుడూ- 

అప్పుడు, వాళ్ళ ముఖాలపై నీడలు ముడతలుపడి దీర్ఘంగా సాగుతాయి. నొసలు చిట్లి
      సాలోచనగా ఎక్కడో కోల్పోతారు వాళ్ళు. శీతాకాలపు గాలికి వొణుకుతాయి అలా
      మొక్కలు. వీధిలో నిర్విరామంగా ఆరుస్తూ, గెంతుతుంటారు పిల్లలు. ఒక పక్కగా
      వంట గదిలోని గిన్నెలని పోగేసుకుని, మట్టి కాళ్ళతో చేతులతో మాటలు లేకుండా
      బొమ్మలకి దుస్తులు వేస్తూ, జుత్తుని సరిదిద్దుతూ, వాళ్ళే

ఐదారేళ్ళ పాపలు, మెరిసే కళ్ళతో. అవతలి ఇంటిలో ఎక్కడో వెనుక బట్టలు ఉతుకుతూ
       మధ్యలో పిల్లలని కేకవేస్తూ, తిరిగి అన్యమనస్కంగా దుస్తుల్ని పిండుతూ తల్లులు.
       గాలికి జల జలా రాలుతాయి అప్పుడు, పాలిపోయిన వేపాకులు: సగం తిన్న
       ఆకుపై నుంచి, విచ్చుకున్న పూవుపై నెమ్మదిగా కదులుతుంది ఒక గొంగళి
       పురుగు. కొమ్మల్లో ఎక్కడో నువ్వు చూడలేని ఒక పక్షి కూత - తనని తాను
       కోల్పోయిన, ఇక  ఎగరలేని రెక్కల తపన. చెట్టు బెరడు పైనుంచి ఒక ఉడుత
       తటాలున చెమ్మగిల్లిన నల్లటి మట్టిపైకి దుమికి, తన వైపు క్షణ కాలం చూసి   
       తన కనులలో కనులు కలిపి కదులుతుంది కదా, సరిగ్గా అప్పుడే

వీధిలోని పిల్లలు తాము ఆడుకునే బంతి తన వాకిట్లో పడగా, వచ్చి అడుగుతారు
       'ఓమ్మా, బాల్ పడింది. ఇవ్వవా' అంటూ. తనలోంచి తాను బయటకి వచ్చి
       తను ఒక నిట్టూర్పుతో, మోకాళ్లపై చేయి ఉంచి అతి కష్టంపై పైకి లేచి, నిన్నే
      ఈ అక్షరాలని చదువుతున్న నిన్నే అందుకుని వాళ్ళ చేతులకు అందించి

ఇక
వొణుకుతూ కరుగుతూ పగులుతూ, ఒంటరి చీకట్లతో తెల్లటి నీడలతో పగిలిన అద్దమై
ఇంటిలోకి నెమ్మదిగా కదిలి, కనుమరుగవ్వుతూ, మొదటిగా చివరిగా ఎప్పటికీ తనే -  

No comments:

Post a Comment