15 November 2012

పాపం

1
రాయాలని కూర్చుంటే
నల్లటి నీడలో తడితో వెలిగిన నీ కళ్ళే గుర్తుకు వస్తున్నాయి

2
పూవువి కదా నువ్వు. రెక్కల్లొచ్చి
ఎండలో వానలో చీకట్లో వెలుతురులో నవ్వులతో ఎగరడం
మాత్రమే తెలుసు కదా నీకు. మరి

3
నేను అతి జాగ్రత్తగానో
చైతన్య రాహిత్యంగానో
ఒక వలను తయారు చేస్తాను నీ చుట్టూ. నువ్వు నిటారుగా
తల ఎత్తి ఆకాశాన్ని చూపినప్పుడల్లా
నేను నీకు భవిష్యత్తుని సూచించి భయపెడతాను- 

'అరవకు' అనో, 'గొడవ చేయకు' అనో '
చెప్పిన మాట వినకపోతే నీకు బొమ్మలు కొనివ్వ' ననో
ఎలాగో ఓలాగా నిన్ను నేలకు దిగేస్తాను.
'నాన్నా, ఆడుకుంటాను' అంటే, కటువుగా 'ముందు
హోం వర్క్, ఆ తరువాతే ఏదైనా' అంటాను. మరి

4.
'నాన్నా నేను పూవుని కదా
నేను వెళ్ళకపోతే, తోటలోని సీతాకోకచిలుకలు
నాకోసం ఏడుస్తాయి'* అని నువ్వు బేలగా అన్నా సరే

5
మృగాలు సంచరించే చదరపు గదుల హృదయం ఇది
ముఖ పుస్తకాలు, నక్షత్ర ప్రసారాలూ మాత్రమే తెలిసిన
ఇరుకు చూపులు ఇవి - మరి నువ్వు

చూపించే చేతివేళ్లును అనుసరించి, నక్షత్ర సముదాయాలనూ
గ్రహాలనూ ఖగోళ విచిత్రాలనూ ఆనందాలనూ చూసే
సమయం లేని, కాంతి లేని కృష్ణ బిలం ఇది. మరి

6
అందుకే, నా మీద నా అసహనంతో కోపంతో కొడతాను కదా నిన్ను
చిన్న చిన్న విషయాలకే, ఎందుకో అర్ధం కాక తెల్లటి కళ్ళతో నీళ్ళతో
చూస్తావు కదా నువ్వు, అప్పుడు

నా శరీరమంతా ఒక తారు దారి. నాలిక అంతా
లోహ ఖచిత యంత్ర రహదారి. గూడు అని నువ్వు అనుకున్న
ఈ ఇల్లంతా నల్లని కాలుష్య సమాధి. అంతటా ఒక మృత్యు ఊపిరి-

7
కాసేపట్లోనే అంతా మరచి ఆ నాలుగేళ్ల చిన్ని అరచేతులతో
హత్తుకుని నా ముఖాన్ని నిమురుతావు కదా నువ్వు
అది గుర్తుకు వచ్చి

రాయాలని కూర్చుంటే, తెల్లటి తడితో
కళ్ళలోంచి రాలుతున్నాయి నల్లటి పదాలై ఈ పై అక్షరాలు
కొంత ధూళై  కొంత దూరమై
కొంత నెత్తురై కొంత శాపమై
నేను ఎప్పటికీ తిరిగి తాకలేని ఒక మహా కాంతి లోకమై-
________________________________________________________
*ఈ వాక్యం HRK మనవరాలు అతనితో అన్న పదాలు. అతను నాతో చెప్పగా -
నేరమైనా సరే- ఇలా నిస్సిగ్గుగా వాడుకున్నాను. ఈ వాచకపు అనుభవం మాత్రం
నా పరిధి లోనిదే.                                    

2 comments:

  1. శ్రీకాంత్! దొంగ, అపద్దం వంటి కొన్ని పదాలు వాడినా దొంగతనం, హిపోక్రసీ కాన్సెప్టులే లేని పాపాయిల నుంచి... దొంగాట ఆడుకుందాం రమ్మని పిలిచి, దాక్కున్న చోటు నుంచి ‘నేనిక్కడ’ అని అరిచే పాపాయిల నుంచి.., ఆట ఆటే గెలుపోటముల గోల కాదని పదే పదే గుర్తు చేసే వాళ్ల ఆటపాటల్లోంచి ఏం తీసుకున్నా అది నేరం కాదు; ఇచ్చామని అనుకోకుండా పరిమళాన్నిచ్చే పువ్వుల్లా, ఎండను ఇచ్చే సూర్యుడిలా వాళ్లిచ్చే వరమది. వాళ్ల పట్ల ఉండాల్సినంత కృతజ్ఙతగా ఉండకపోతేనే నేరం. అమ్మూ తల్లి ఆ మాటలు మనసులో తిరిగి తిరిగి నేనూ ఒక ప్రయత్నం చేశాను. నా ప్రయత్నాన్ని ఏం చేద్దామా అనుకుంటుండగా ‘చంద్రనీలిమ’లో ఈ అందమైన పద్యం. రెండింటిలో ఉన్న ఒకే రకం వయోజన అపరాథ భావనతో కొంచెం ఆశ్చర్యం, చాల సంతోషం కలిగాయి. దీన్ని సెలబ్రేట్ చేసుకుందామనిపించి నా పద్యాన్నీ ఉంచుతున్నాను ‘పిచిక గూడు’లో. 

    ReplyDelete