05 November 2012

ఏమిటది?

1
నిన్నేమీ అడగవద్దు అనుకున్నాను కానీ
     ఇది ఒక్కటే
2
ఎప్పుడైనా చూసావా నువ్వు
     చీకటి చినుకులని కళ్ళల్లో వేసుకుని
     కుర్చీలో అలా ఒదిగి నిర్లిప్తంగా రాత్రిని
     చూసే మనిషిని? ఇక అతని
3
నుదిటిపై సర్పాలు నడయాడతాయి
     పెదాలపై నీ విషపు రుచి అప్పుడు. తెరచిన
      అతని నోటిలోంచి నీ నాలిక
      కొన్ని పదాలతో బుసలు కొడుతుంది. చూడు
4
చెట్ల కింద విరిగిన నీడలని.
     ఇసుక పోగేసుకుని కట్టుకున్న గూడు చెదిరి
     కళ్ళంతా నిలువెత్తు వానైన పిల్లలని.
     అప్పుడు ఉంటావు నువ్వు  అక్కడ
5
పగిలి నెత్తురంటిన గాజులను ఏరుకుని
     ముంజేతులతో బుగ్గలని తుడుచుకుంటూ:
     ఈ నిప్పు అంత త్వరగా ఆరిపోయేది కాదు.
     ప్రేమ ముద్రిక అది, అంత తేలికగా వొదలదు
     నిన్ను. రక్షణ కవచం
6
ఏదీ  లేక  ముడుచుకున్న పావురం ఎవరో
     నీకు తెలియదా? నీ రెక్కలని నిమిరలా
     నిన్ను హత్తుకునే శరీరమేదో తెలియదా?
     ఎదురు చూసీ చూసీ నుదిట బొట్టు నీరై
     జారిపోతే
7
అప్పుడప్పుడూ శపించడం తప్పేమీ కాదు.
     ఇంతకూ శాపగ్రస్థులు ఎవరో తెలిసిందా? చూడు
     ఒక చందమామ ఎర్రగా ఉదయించింది. ఒక
     వెన్నెల నీళ్లై నిన్నూ నన్నూ చుట్టుకుంది. అందుకే
8
అడుగుతాను ఒకటి నిన్ను, అడగవద్దు
     వద్దొద్దూ అని అనుకుంటూనే ఇలా. మరి
9
ఇదే, ఇలా నిన్ను అడగాలనుకున్నదే
     నేను తరచూ మరచిపోతాను.
     ఇంతకూ ఏమిటది?          

No comments:

Post a Comment