14 November 2012

ఆకస్మికం

పొగమంచు కిటికీలలోంచి లోపలికి సాగిన వేళ
     ఎందుకో జలదరించి ఒక్కసారిగా కదులుతారు పిల్లలు. 
     దుప్పటిని వాళ్ళపైకి మరలా ఒకసారి జాగ్రత్తగా సర్ది
     ఇదిగో అలా చేతులు ముడుచుకుని కూర్చుంటాడు అతను: 

ఇక ఈ వేకువఝాము చిన్నగా కదిలగా ఎక్కడో తన కళ్ళ కింద 
     ఒక తెల్ల గులాబీ మొగ్గ విచ్చుకుంటుంది.  మంచుకు తడిచి
     గాలికి సన్నగా కదిలే ఆ గులాబీని 
     తనకి తెలియకుండా తన కలలోకి 
     జొరబడి తాకాలనే కోరిక అతనికి- 
     కానీ నిదుర వస్త్రాన్ని లాగకుండా 
     పిల్లలని లేపకుండా తన ఊపిరిలో
     ఊగే పూలపై అతను తన  పెదిమలని ఆన్చడం ఎలా?   

సరిగ్గా అప్పుడే      
అలా, అయోమయంతో అతను గింజుకుంటుండగానే, నిదురలోనే 
     అతని గుండె కొట్టుకునే చోట, తన అరచేయి 
     నెమ్మదిగా వాలి గూడు కట్టుకుంటుంది.ఇక 
     తటాలున గదిలో ఒక చితుకుల మంట రేగి 
ఆకస్మికంగా అతనికి అప్పుడు ఒక మహా రహస్యం తెలిసివచ్చి

ఇక ఎన్నడూ తిరిగి రాలేదు అతను, ఇక్కడికి- తను ఉండే చోటికి-

No comments:

Post a Comment