తల వంచుకుని ఇంటికి నడుచుకుని వస్తావు నువ్వు. ఇక నీ కాళ్ళ కింద లేత సూర్య కాంతి పసుపు నీళ్లై పోర్లిపోవడం చూస్తావు. తల పైన చెట్ల కొమ్మలు గాలికి జలదరిస్తే, నీ పాదాల వద్ద నుంచి గుప్పున లేచి గుంపుగా ఎగిరిపోతాయి ఆకుల నీడలు: ముఖ్యంగా, రావి ఆకులు, ఎవరివో కన్నీళ్ళని దాచుకున్నట్టు ఉండే , మౌనముద్ర లోంచి లేచి, పొర్లి పొర్లి పారే నీళ్ళ సవ్వడితో నిన్ను మరో దిగులు లోకాలకి తీసుకుపోయే రావి ఆకులు. అవే నువ్వు నడుస్తూ ఉండగా గుర్తుకు వచ్చే ముకుళితమయిన ముఖాలు. తలుపు చాటు నుంచి చేయి ఊపుతున్నట్టూ, అరచేతిలో ఆఖరిసారిగా క్షణ కాలం అరచేయి ఉంచి వెనకకి లాక్కుని, బలవంతపు నవ్వుతో చిట్లిన పెదాలతో వీడ్కోలు అయ్యినట్టూ
నీ రక్తంలో రక్తం అయిన వాళ్ళూ, నీ గుండెలో ఊపిరి అయిన వాళ్ళూ ఎవరిని పిలవాలన్నా వాళ్ళను పిలిచే పలుకు అలవాటయ్యి నీ నోటి నుంచి వారి పేరు తప్ప మరో పేరు రాని వాళ్ళూ, వాళ్ళే గోధూళి వేళ రేగిన చీకట్లలో మిణుకు మిణుకు మంటూ కనిపిస్తూ, ఎంతకూ నువ్వు దరి చేరలేని వాళ్ళూ , నువ్వు వొదిలి వేసుకున్న వాళ్ళూ, నువ్వు చివరిదాకా ఉందామనుకున్న వాళ్ళూ నీకు చివర అయిన వాళ్ళూ నిను చిత్తుగా ప్రేమించిన వాళ్ళూ నిన్ను ప్రేమించి చిత్తయిన వాళ్ళూ నీ శరీరాలంత సలుపుడు పుండులై నువ్వు నీ చితి దాకా మోసుకు తిరిగే వాళ్ళూ సర్వమూ అయ్యి ఏమీ కాని వాళ్ళు ఏమీ లేక నీ వద్దకు వచ్చి ఒక గూడుని కట్టుకుని పిల్లలని కానీ పెంచుకుందామనుకున్న వాళ్ళూ పిల్లలూ లేకా నువ్వూ లేకా రాకా రెక్కలు విరిగి శిగమెత్తి రోదించే వాళ్ళూ తెల్లని వాళ్ళూ నల్లని వాళ్ళూ ఛామన ఛాయ వాళ్ళూ ఒళ్ళున్న వాళ్ళూ ఒళ్ళు లేని వాళ్ళూ నిన్నొక స్మృతి చిహ్నంగా వెలిగించిన ప్రమిదెల కింద దాగిన నీడలలో తల దాచుకుని తలుచుకునే వాళ్ళూ, వాళ్ళే
నువ్వు తల వంచుకుని ఇంటికి నడచి వస్తున్నప్పుడు, ఈ గాలిలో ఈ చెట్లల్లో నీ చుట్టూ ఎగిరే పురుగులలో వాలిపోయిన సీతాకోకచిలుకలలో ముసురుకునే చీకట్లలో స్థంబించిన నిప్పులో వీధి దీపాలలో చేయి చాచి ముందుకు వచ్చి కపాలం వంటి అరచేతిని వొణుకుతూ నీ ముందు ఉంచే భిక్షగత్తేలుగా మార్చబడిన తల్లులతో దారి పక్కగా ఆగి ఉన్న వేశ్యలతో అద్దిన నెత్తురు ఎండి పెళుసుగా పగులుతున్న పెదాలలో పిల్లలు లేని పాలిండ్లలో ఏడ్చే యోనులలో ఇక ఏడ్వలేక ఆగిపోయిన అనాధ పసిపిల్లలలో పగిలిన పాదాలలో పగలే లేని జీవన ఎడారులలో, మరి
ఎక్కడ చూచినా నువ్వే అయితే, కన్నా, ఇక అతడొక్కడే ఒక్కడై దేహాత్మలు లేక దేవులాడుకుంటూ కబోధివలె తడుములాడుకుంటూ, ఈ స్మశాన మహాసామ్రాజ్యాలలో
పగిలీ
విరిగీ
చిరిగీ
తన హృదయాన్ని
తన అరచేతిలోకి
తనే తీసుకుని
తనే
తినీ
తినీ
తినీ
నమిలీ
నమిలీ
నమిలీ
ఇక ఊస్తే
నెత్తురుతో చెల్లా చెదురైన
ఈ పదాలు
మరి నీకే.
మరి నీకే.
No comments:
Post a Comment