16 November 2012

క్షుద్ర పదాలు

గుళ్ళో దండం పెట్టుకుని, ప్రార్ధన చేసి
చల్లగా ఇంటికి వచ్చి
పుణ్యం చేసామను
           కున్న వాళ్ళందరితో ఇల్లా
           అన్నాడు మోమితేష్: అన్నాల్లారా, అమ్మల్లారా

గీతకు ఇవతలా, గీతకు అవతలా సరే కానీ
గీత గీసీందెవరు, గీతను
కాపాడుతున్నది ఎవరు?

గీతాలు లేని లోకానికి గంతలు కట్టి
చూపునిచ్చామని
చెబుతున్న వాళ్ళు
                ఎవరు? అమ్మల్లారా, అన్నాల్లారా, అక్కల్లారా

సావిత్రి సరే, సీత సరే మేరీ మాతా సరే మరి
ద్రౌపదిని
ఊర్మిళని

పవిత్ర పాత్ర మాగ్ధలీనాని
నిలువెల్లా ఆత్మతో తాకేది
              ఎవరు? కబోధి

ని నేను కానీ వాచక విముక్తం లేక వినిర్మాణం కాలేక
    శరీరమంత తోలు మందం
    వాక్యాల పునురుక్తమై - లోపలే ఉన్న రాజ్యాన్నీ
ఉద్యానవనాలనీ పాప పంకిలం చేస్తున్నది ఎవరు?

నేనొక బహిష్కృతడనే కానీ
గర్భ ద్వేష పుణ్య పురుషల
        దేశంలో లోకంలో కాలంలో, అన్నల్లారా తమ్ముళ్ళారా
        అక్కల్లారా చెల్లెల్లారా, మర్మావయం అయిన
        పురుషుల్లారా

తల్లి గర్భాన్ని ఆలింగనం చేసుకుంటున్నాను ఇలా హాయిగా
నిండుగా నిర్భీతిగా
మరి నా ఆత్మతో నా
శ్వాసతో నా అంతిమ
మృత్యువుతో- అది

సరే కానీ మరి నువ్వేమిటి? నీ సంగతేమిటి? అని అన్నాడు అతను
స్వదేహ సమాధిలో
సంలీన మవుతూ-

నేను నవ్వి, నేను ఏడ్చి నేను పగిలి పిగిలి 'నేను' లేకుండా
పోయి, ఇదిగో వచ్చి ఇల్లా రాస్తున్నాను

ఈ అమృత క్షుద్ర పదాలు, ఒక
మార్మిక ఆదిమ తపనతో, ఒక
తొలి మలి రహస్య దాహంతో-
మీకు కాక మరి నాకే దారి దిక్కూ తోడూ నీడా లేకుండా. ఇల్లా.                     

1 comment: