ఎలాగూ వంట చేయడం రాదు కదా మనకి, ఇక సరేనని చూసుకుందాం లెమ్మని, లేలెమ్మని హాస్టల్లో నా గదిలో
ఒక గిన్నె అప్పు తెచ్చుకుని, ఇంత ఎద్దు మాంసం పుచ్చుకుని ఆ కుక్కర్లో వేసి ఇక దాని ముందు కూర్చున్నాం నువ్వూ నేనూ. అంతటితో ఆగక ఒకటే పడిగాపులు, అది ఎప్పుడు అవ్వుతుందా అని, అది ఎప్పుడు ఉడుకుతుందా అని మనం ఆ రాత్రి మన పక్కన చల్లగా జేరిన మధుపాత్రలతో రెక్కలు విప్పిన ఓ వెన్నెలతో, (మరి దబుష్ దాని పేరు, తెల్ల పూలగుత్తి వంటి ఆ పిల్లి పేరు) మన స్త్రీలను గురించీ, మనకు దక్కని స్త్రీల గురించీ, ఇంకా స్త్రీలు కాని అమ్మాయల గురించీ కొన్ని వింత మాటలతో ఆటలాడుకుంటూ మనం, సరే మనకెలాగూ వంట చేయడం రాదు కదానీ, సరే మనకెలాగూ లాగుల లేవు కదానీ, సరే మనకెలాగూ ఇక ఈ లోకంతో పని ఏమీ సంబంధం ఏమీ కదా అనీ : మరే
అయితే ఇక తొందర ఆగక, ఆగలేని తొందరతో ఆ స్టవ్ ముందు, ఆవిరి ఆవిరయ్యేదాకా ఇక కూర్చోలేకా , ఆవిరి అవిరయ్యేదాకా ఆగాలని తెలీకా, ఇక నిను చూస్తో వీరగర్వంతో నవ్వుతో నీకు మహా నల భీమ పాకపు మెళుకువలు బోధిస్తో, గుక్క గుక్కగా రమ్ ని నువ్వు హే రామ్ అంటో తాగుతుండగా, ఓం తత్సత్ అంటో నువ్విచ్చిన నెత్తురు విల్ల్స్ ని నేనొక సాధువులా పీలుస్తుండగా ఏం చేసాను నేను?
మరే, మరి నువ్వు నీ ప్రియురాలి దగ్గరనుంచి బ్రతిమాలుకుని, తన గదిలోంచి తెచ్చుకున్న ఆ కుక్కర్ ను ఇక ఆలాస్యం చేయక, నీ సూచనలని అవలంభించక, దానిని తెరిచేందుకు ప్రయత్నించీ తెరవలేక, మత్తెక్కిన ఒక కచ్చతో, అల్లం వెల్లుల్లీ కలగలసిన మాంసం వాసన కల్పించిన మైమరుపుతో, ఇక లాగుతాను కదా ఆ మూతను నా సర్వ శక్తులనూ ఒడ్డీ, ఇక చూడు అప్పుడో విస్ఫోటనం: ఎవరి శాపాల వడ్డీతోనో పేలుతుంది డ్డామ్మని నీ మళయాళపు లలన ప్రాణం, స్టవ్ పై నుంచి ఎగిరిపోతుంది ఆ కేరళా పాత్రా మన ఆత్రుతా మన గాత్రం గోత్రం దీవెనా ప్రార్ధనా పాపం. మరిక చూడు అప్పుడు నీ ముఖం నా ముఖం
హే కృష్ణా, జీసస్ అల్లహా, పాత్ర మూత ఎక్కడికో కొట్టుకుపోయి, చిమ్ముతాయి మరి నా ముఖం నిండా, నా గది నిండా ఫాను పైనా టేబుల్ పైనా లైటు పైనా షెల్ఫ్ పైనా నీ షర్టుపైనా, జుత్తుపైనా కాలుతూ, నాసికల పై నుంచి మెల్లిగా జారుతో, గుప్పిళ్ళతో ఆకాశం నుంచి ఎవరో ఇకిలిస్తూ నక్షత్రాలని వెదజల్లినట్టు, ఒక వెన్నెల చినుకులని తుంపరగా జల్లినట్టు, చక్కగా ఉడికిన ఆ ఎద్దు మాంసం ముక్కలు కమ్మని పుదీనా వాసనతో: ఇక అందుకే
విధి వంచితులమై, ఏమీ చేయలేక, ఏమీ చేయ రాక ఆ గదిలో ఉండలేకా వెళ్ళాలేక, "వొద్దంటే విన్నావా మామా, మూత ఇంకా ఉంచాలి అంటే విన్నావు కాదు" అని నువ్వు అంటే ఇక నేను ఆ ముక్కల్ని ఏరుకు రాగా, మందు తాగి హాయిగా వెళ్లాం మనం మళ్ళా నిస్సిగ్గుగా మన స్త్రీల గదులకి హిహ్హిహ్హీ అనుకుంటో, అన్నానికి ఇన్ని డబ్బులు అడుక్కునేందుకు, ఒక ప్రియమైన సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలతో, మన వీరోచిత వంట మహాకధనాన్ని అందరికీ ఘనత వహించిన మహారాజశ్రీ వదనంతో చెబుతో అభినయిస్తో ఆనందిస్తో-
మరి రమా, మరి ఇవాళ ఇదంతా ఎందుకంటే, మనం లేని ఆ గదుల ముందు నేను ఇప్పుడు నడుస్తుంటే, ఇప్పటికీ ఆ గుమ్మాల ముందు తిరుగుతున్నాయి నీ నా ఆత్మలు పురాకృతమై, ఒకప్పుడు బ్రతికిన ఆ కాలాలై ఆ లోకాలై అ అక్కడ నుంచి వెళ్ళలేకా అక్కడకి తిరిగి పోలేకా, కళ్ళల్లో చితులతో, బాహువుల్లో సమాధులతో, ఎప్పుడో దారి తప్పి వెళ్ళిపోయిన మన దబుష్ తో, ఆ తెల్లని కుక్కతో, ఇక ఎప్పటికీ తిరిగి పచ్చిక పైకి మన వద్దకి తిరిగి రాని దాని చిన్ని చిన్ని పిల్లలతో-
sir , dabush ..is that cat or dog?
ReplyDelete