10 November 2012

చరిత్ర


ఆవాహన చేస్తున్నాను. పెదాల చివరి దాకా వచ్చిన మాటని
     అక్కడే నొక్కిపట్టి, తుంపర కురిసే కాలాలలోకి కనులను వదిలివేసే
               మహాకళను నిన్ను స్మరించుకుని అభ్యాసం చేస్తున్నాను. చేతులు

తవ్విన భూమిలోకి దిగిన శరీరం నీవు. నా శరీరంలోంచి వేయి కొమ్మల వృక్షమై
       గన్నేరు పూలతో వికసించే మహా ఆకాశం నీవు. ఈ అబద్ధం నిజమే. ఒక
                 చినుకంత విత్తుని నాటి చిగురాకుని ఆశించిన ముఖాన్ని తాకిన

నిలువెత్తునా రివ్వున రేగిన నల్లని నాగు పడగవి నీవు.
      ఇంద్రజాలంతో కమ్మేసే సర్పహాస నయనివి నీవు. చూడు. పదాలు లేని
                   మొండి చేతులతో శ్వాసించే శిలయై ఉన్నాడు ఫిరోజ్, ఊర్మిళై ఒక

మహావిష -విస్మృతి లేని- నిదురై, నువ్వు లేని పాతాళ లోకాలలో
         కన్నీటి తల్పంపై మరలా మరలా జన్మిస్తూ. జన్నత్ ఎక్కడా అంటే
                అంటాడు కదా ఫిరోజ్ ఇక మధుపాత్రని నీలి ఆకాశపు అంచుకి తాకిస్తూ

"సోదరుడా: అడగకు రాముడిని రామ బాణపు గురి గురించీ పదును గురించీ
          చూడు నెత్తురు పొటమర్చిన ఈ గుండెనీ, సీత హృదయాన్నీ. అడగకు ఫరీదానీ,
                     శిలా విగ్రహ భక్తులనీ హత్యల గురించీ అద్రుశ్య

హంతకుల గురించీ, చూడు గూళ్ళు లేక తెగిపడిన తలలనీ
               మధుశాలలలో ఖండితమైన ఫిరోజ్ లనీ." ఇక చూడు,
                      నీ ఇంటి ముందు నుంచి నడచే పోయారు ఆ ఇద్దరు రాత్రుళ్ళతో

స్మిత వదనాలతో , హృదయాలలో నిండుగా దిగిన చరిత్రలతో బాకులతో.
ఆ ఇద్దరిలో ఎవరు ఎవరుగా మిగిలారో ఇక ఎవ్వరూ ఎవ్వరినీ అడగలేదు.

No comments:

Post a Comment