17 November 2012

అసాధ్యులు

తింటుంటే పొలమారి, దగ్గి దగ్గి, కళ్ళలోకి నీళ్ళు వస్తుంటే
     తల మీద అరచేత్తో తడుతూ అంటుంది తను: ఎవరో
     తలుచుకుంటున్నారు నిన్ను - మరి ఎవరో వాళ్ళు?

ఇక తనొక గ్లాసుతో నోటికి నీరు అందించి
కుతూహలంగా నీవైపు చూస్తుంటే, మరి
నువ్వు ఓర కంటితో తన వైపు చూసీ చూడక, నీ గత
     ప్రియురాళ్ళందరినీ తలుచుకుంటావు

అన్నం ముద్దలను తమ అరచేతులతో నీకు అందించి
చివరికి ఏమీ మిగలక, మరకలంటిన
పాత్రలై మిగిలిపోయిన
ఆ కన్నీళ్ళ కలువలనే

తలుచుకుంటావు, పొక్కిలైన హృదయంతో: మరిక
ఒక జవాబుకి నీ వైపు అలాగే తదేకంగా చూస్తున్న
నీ స్త్రీకి ఏమీ చెప్పలేకా ఇక ఒక
అన్నం ముద్ద మింగుడు పడక

తెరిచిన తలుపులలోంచి చల్లటి గాలి రివ్వున నిన్ను
చరుస్తుండగా, లేచి చేయి కడుక్కుని, తను
అందించిన  తువ్వాలుతో తుడుచుకుంటూ 
అనుకుంటావు ఇలా: "Gaaaaaaaaaaaaad
these wives are impossible. అసాధ్యులూ
అనితర సాధ్యులూ వీళ్ళు-", అని బింకంగా
బేలగా పరమ దిగులుగా అంతిమ చరణంగా- 

No comments:

Post a Comment