09 November 2012

తేనీరు

అరచేతుల మధ్య ఒక కప్పును పుచ్చుకుని
     పొద్దున్నే తేనీరుగా మారుతావు కదా నువ్వు
     అప్పుడు అల్లం వాసన వేస్తాయి నీ చేతులు.
     మరి నీ పెదాల మధ్య నుంచి కొంత ఏలకుల సుగంధం కూడా.

చల్లటి వెలుతురు ముసురు కమ్మిన ఆకాశం
     అప్పుడు నీ కళ్ళల్లో. అల్లుకున్న తీగపైనా
     లేత ఆకులపైనా కొంత మంచు తడి. దానిపై ఒకసారి
     నీ చేతివేలు వాలి ఇంద్రధనుస్సులను కదుపుతుంది
   
ఇక ఆ ఏడు రంగుల తాకిడిలో, ఆ ఆకుపచ్చని గూటిలో
     కీచుమంటాయి మొన్న పుట్టిన చిన్ని పిట్టలు. ఇక
     రెక్కలొస్తాయి అప్పుడు నీకూ నీ హృదయానికీనూ.
     ఆ మెత్తటి నిశ్శబ్ధంలో, దుప్పటిలో ముడుచుకుని
      అస్సలే కదలరు మన పిల్లలు. ఇల్లంతా

ఒక శాంతీ, కాంతీ, గోరువెచ్చని నీడలూ, అలంకారిక
పింగాణీ వస్తువులపై ఆగే లోకమూ
అతి సూక్ష్మంగా  వాటిపై పేరుకునే
కాలపు ధూళీనూ.సరిగ్గా అప్పుడే         

నీ వెనుకగా చేరి నా చేతుల మధ్యకు తీసుకుంటాను
     నిన్ను. చూడు, ఇక ఈ ఉదయాన
మరో కప్పు తేనీరు త్రాగవచ్చు మనం

నింపాదిగా, శాంతిగా, తొలిసారిగా-  

2 comments: