01 November 2012

మహామంత్రగత్తె

కొంచెం ముఖం బావుందనుకో, హృదయాలని చిత్తడి చిత్తడిగా
తవ్వి తవ్వి నిలబడి చోద్యం చూసే కళ తెలుస్తుంది
అరె ఇక కొంచెం దేహం బావుందనుకో, మగవాళ్ళని
నీడలుగా మార్చి నీ పాదాల వెంబడేసుకుని  తిరిగే
   
అతి క్రూర వినోదా చాతుర్యం అర్ధం అవుతుంది. ఆపై
కొంచెం తెలివీ కొంచెం పద చాతుర్యం ఉన్నవేవనుకో
చూడు చూడిక, ఈ ముఖ కుగ్రామాన్ని త్రవ్వీ  త్రవ్వీ
   
ఒక శ్వేత మార్జాలంగా మార్చి నీ చుట్టూ తిప్పుకునే
ఒక మహాతాంత్రిక వశీకరణ విద్యా అబ్బుతుంది
ఇక జగన్మోహినీ - నీకొక చక్కటి మొండితనమూ
పురుష వ్యాకరణం లేని జాణతనమూ ఉన్నదే అనుకో

నీ జ్వలిత జననాంగాల దేహ వాక్య విన్యాసాల చుట్టూ
ఈ పరమ పురుష సూక్తావళి
గిరికీలు  కొట్టీ  కొట్టీ  కొట్టీ
నీ మహా జ్వాలను  తాకి
గిరగిరా తిరిగీ తిరిగీ తిరిగీ

నిను స్తుతిస్తో, నీ ఆ జంతర్ మంతర్ మహావాచకంలో     
నీ అత్యాధునిక రామాయణంలో దగ్ధమవ్వడమూ
నీకు నువ్వే ఒక తిరుగులేని
మహాకధనంగా మారడమూ
అవగతమవుతుంది-

ఇంతకూ తెలుసా నీకు, నువ్వొక మాయామహిమాన్విత మహామంత్రగత్తెవని?              

2 comments: