27 November 2012

నేనూ, నా అ/జ్ఞానం

వేళ్ళ చివర్లని నీటి రంగులలో ముంచి
     ముద్రికలై తెల్లటి గోడల మీదా, కాగితాల మీదా వాలతారు పిల్లలు
     మరే, నువ్వు కవిత్వమని గీసుకున్న పిచ్చిగీతల మీద కూడానూ: 

వాళ్ళ బొటన వేళ్ళపై ఉంటాయి అప్పుడు ఆకాశాలు నారింజ రంగులతో 
వాళ్ళ కళ్ళల్లో వీస్తాయి అప్పుడు ఉవ్వెత్తున అరణ్యాల శీతల పవనాలు 
గూడు కట్టుకుంటాయి వాళ్ళ శరీరాల్లో
కాంతి ప్రపంచాల తెల్లని తేనె పిట్టలు - 

బుగ్గలపై,  ముంజేతులపై, నుదిటిపై 
అప్పుడే స్నానం చేయించి వాళ్ళమ్మ
తొడిగిన పూల దుస్తులపై నిండా శాంతిగా హాయిగా ఇష్టంగా ఒలికిన 
రంగులు. అవి వాళ్ళ నవ్వులూనూ-

తప్పుకుని, తప్పుకుని  నువ్వేమో 
కడు జాగ్రత్తగా పిల్లి పిల్ల వలే బహు
నేర్పరితనంతో పోగుచేసుకున్న జ్ఞానంతో లౌక్యంతో లోకానికి లోకాన్ని 
ఎలా ఉద్ధరించాలో చెబుదామని అలా 

కదులుతావు కదా ముఖ పుస్తక తెరల ఆ  
కరకు దంతాల మాయా పేటికకు ముందూ
అప్పుడు తటాలున ఒకరినొకరు వెంటాడుకుని వచ్చి నువ్వు రాసుకున్న
కాగితాలపై నీ ఇనుప సంభాషణలపై ఏడూ 
రంగుల వానలై ఏడూ రంగుల జలపాతాలై

డ్డామ్మని కురిసి, రాలి నిన్ను పూర్తిగా తడిపి 
వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళే, నీటి రంగులతో 
కలల అలజడులతో కదిలే పాపం పుణ్యం ఆత్మా దేహం ఎరుగని నీ పిల్లలు.
ఇక గదిలో తటాలున వెలిగిన వెన్నెల్లో కొన్ని 
సీతాకోక చిలుకలు ఎగిరి,  నీ కళ్ళ అంచున నలిగిన కన్నీళ్ళ అంచులపై 
వాలి, ముని వేళ్ళతో నిన్ను దయగా ప్రేమగా 

నిమురుతుండగా, రంగులతో కలగాపులగమైన 
నీ అక్షరాలని చూస్తూ అనుకుంటావు నువ్వు:

"మరే. మరి ఇన్నాళ్ళకు ఈ పదాలయితే విముక్తి 
చెందాయి కానీ, మరే మరి నేనూ, నా అ/జ్ఞానం?"        

No comments:

Post a Comment