1
"you can never write a poem"
he said. అందుకని
2
రెండు అరచేతుల్లోకి పొగమంచుని
అందుకుని, ఒక గులాబీని
తయారు చేసాను. దానిపై
రాత్రి కాంతినీ పగటి చీకటినీ ఉంచాను
దానికి నేను, 'నువ్వు'
అనే పేరు పెట్టాను.ఇక
అది మట్టిలోమగ్గిన, చల్లటి
నీ వేళ్ళవేర్ల వాసన వేసింది-
3
"you can never write the Other"
he said. అందుకని
4
మబ్బులని కిందకి లాగి, నెమ్మదిగా
పాకే గొంగళిపురుగుకి తగిలించాను
పుప్పొడిని, దానిపై చిలుకరించాను
ఇక అది, ఆకాశంలోకి ఎగిరినప్పుడు
దాని రెక్కలపై నక్షత్రాలు మిలమిల
మన్నాయి. దాని పాదాల కింద
మట్టి రెప్పల్లల్లే రెప రెప లాడింది
భూమంత బరువున్నచిన్నిచిన్ని
అశ్రువులు, దాని కళ్ళలో
మరి బావురుమన్నాయి
ఇక నేను దానిని నేను 'నువ్వు'
అని ఎలా పిలవగలను?
5
"I can never write a poem"
I said. అందుకని
6
గుండెల నిండుగా మట్టి రాసుకుని
చినుకులతో నిండిన హృదయాన్ని
నల్లటి మాగాణి మట్టితో పిసికి పిసికి
అతడొక ప్రమిదెనీ, ఒక పక్షిగూటినీ
తయారు చేసాడు. అతని నెత్తురూ
అత్తరూ అంటిన గూడూ దివ్వె, ఇక
తన వాసన వేసాయి. తను
వెలిగించిన వొత్తీ కాంతీ ఒక
ఆదిమ ఆకలినీ, శాంతినీ అ
శాంతినీ కలిగించాయి.
దానికి అతను, 'నువ్వు' అనే పేరు
పెట్టేలోగా, ఒక తల్లి వొంటరి స్థన్యం
ఒక అద్దమై అతని ముందు నిలిచింది
గూటిని గువ్వనూ దివ్వెనూ
గుండెలకు చరచుకుని
అతను రోదిస్తుండగా, ఇక
ఈ తెరపై ఇలాగే రాసాను,
కొట్టివేతలు లేని పదాలతో-
7
"You are a poem. And I,
write you like this:" ఎలాంటే
ఎలా అంటే
8
ఆత్మైన దేహం. దేహమైన దీపం
దీపమైన, ఒక ద్వీపం.
ద్వీపమైన ఒక దాహం.
దాహమైన ఒక జీవం-
జీవమైన ఒక పదం. పదమైన
ఒక దైవం. దైవమైన ఒక
శబ్ధం. శబ్ధమైన ఒక నిశ్శబ్ధం.
ఆమెన్. ఇక రాసుకుంటాం
9
మనం
పిల్లలమై, పాపలమై పూవులమై
వెన్నెలమై వానలమై
గోరింట అరచేతులమై
ఇక్కడే ఇక్కడే, కాందిశీకులమై
శరనార్ధులమై తెల్లటి
కాంతి అంచున ఊగిసలాడే
నీడలై, ఆ నల్లటి నుసియై -
No comments:
Post a Comment