26 December 2012

Don't you know that I aint a metaphor?

వొద్దు. వెన్నెల వొద్దు.  పూవులు వొద్దు. లతలు వొద్దు. జాబిలిలు వొద్దు. ఆకాశం వొద్దు. నక్షత్రాలు వొద్దు. పుప్పొడి వొద్దు. లేత గాలులు వొద్దు. తడచిన రాత్రుళ్ళు వొద్దు. గులాబీల దినాలు వొద్దు. హంసలు వొద్దు. హంస నడకలూ వొద్దు. నీలి కనులు వొద్దు. నీలి సముద్రాలు వొద్దు. నిమోన్నతాలు వొద్దు. మేఘాలు వొద్దు. అటువంటి ఓడీ వొద్దు. ఓరిమి వొద్దు. మాతృత్వం వంటి వరం వొద్దు. సహనవతి వొద్దు. సతీ వొద్దు. సావిత్రీ వొద్దు. సీత వొద్దు. ఊర్మిళా వొద్దు.

స్త్రీ అంటే అని మొదలయ్యే వాచకాలూ వొద్దు. పురాణాలూ వొద్దు. పవిత్రత వొద్దు. పాపం వొద్దు. పుణ్యం వొద్దు. ధ్రౌపదీ వొద్దు. శబరీ వొద్దు. వొద్దు. థెరీసా వొద్దు. మాగ్ధలీనా వొద్దు. లైలా వొద్దు. మల మూత్రాదులు లేని అతి సౌందర్యమైన దేవతా స్త్రీలూ వొద్దు. కాళికలు వొద్దు. సరస్వతీ దేవీలూ వొద్దు. వొద్దు. అసలే వొద్దు. నిర్వచనాలు వొద్దు. నీ వచనాలు వొద్దు. సోత్రాలూ వొద్దు. ఆరాధనలూ వొద్దు. అర్పణలో వొద్దు. ప్రేమా వొద్దు. త్యాగమూ వొద్దు. ఆబలా వొద్దు. సబలా వొద్దు. అమ్మా వొద్దు. చెల్లీ వొద్దు. భార్యా వొద్దు. భక్తీ వొద్దు. బంధమూ వొద్దు. నిర్మాణ వాచకమూ, వాక్యమూ వొద్దు. ఇక 

ఈ ఒక్క పూటకి ఇలా నేను: ఇలా నన్నుగానే ఉంచు. ఇలా నన్నుగానే మాట్లాడు. చితికిన యోనిగానూ, నరికిన వక్షోజాలగానూ, నమిలిన ఊసేసిన పెదాలగానూ, తెగిన పేగులగానూ, వేల మర్మావయవాలు నిరంతరం కుళ్ళ బొడిచే ఒక యుద్ధభూమిగానూ, పురుషాంగమే ఒక దేశమైన, దేశమంటేనే పురుషావయవమైన ఒక కాలంగా స్త్రీ లేని ఒక లోకంగానూ మాత్రమే 

చూడు ఈ ఒక్క పూటకి. పిల్లలు లేని తల్లిగానూ, ఏమీ లేక ఖాళీ అయిన ఊరులానూ, నెత్తురు కమలం విచ్చుకున్న ఒక గుజరాత్ గానూ, హస్తం లేని వస్త్రరహిత రాజకీయంగానూ, నీలం బొమ్మలుగానూ, నీతి లేని రాజకీయ నాయకులగానే, తల్లి స్తన్యం తాకని వారి మాటలుగానే

చూడు ఈ ఒక్క పూటకి నన్ను. అన్నం పెట్టిన శరీరాన్నే, అంగట్లో పెట్టిన అధికారపు శాంతియుతమైన భాషణగానే, నవ రంధ్రాల మల మూత్రాల తోలు తిత్తిగానే  చూడు నన్ను ఈ పూటకి. ఏమీ కాదు. కొంత వణుకు పుట్టి, కొంత భీతి కలిగి, కొంత హృదయం కదిలి కొంత శరీరం జలదరించి, కళ్ళు కొంత కన్నీళ్ళయ్యి, జన్మస్థానం మరణ ప్రస్థానం కొంత అర్థమయ్యి, తాకుతావు నువ్వు నన్ను తొలిసారిగా, ఒక మాట లేని మాటతో:

                    Don't you know that I aint no metaphor?" అని అంది తను నిన్న
                    పాలరాతి పలకల వలే మారిన శరీరంతో, తన చుట్టూ
                    ఒక ఆదిమ సర్పం ఒక ఆదిమ బాణం, ఒక ఆదిమ ప్ర
                    వక్తా భాష్యం నడయాడుతుండగా. 

2 comments: