10 December 2012

పాప పరిహారం

ఒక మాట మంటై, మంత్రమై నిన్ను
వెలిగించేందుకు ఆగి ఉంది చూడు-

అదే, నీకూ నీ వాళ్ళకూ మధ్య
     ఉన్న ఆ సన్నటి దూరమే, వొత్తికీ వెలిగిన
     పుల్లకీ మధ్య, కనుపాపనీ దానిని తడిమే
     కనురెప్పకీ మధ్యా ఉన్న, ఆ దూరమే ఆ
     వెచ్చటి ఉప్పు చెమ్మే, కనులలోంచి జారే
     ఆ నిమ్ము నీరే

ఉంది, నీకూ నాకూ మధ్య, చీకటింట
ఇంకా లేవనెత్తని పాడె వలే,మసక
సాయంత్రాన వానలో ఆరిపోయిన
సగం కాలిన శవం వలే: ఒరే నాయనా

ఎందుకు బ్రతకకూడదురా మనం
ఒక మాటని, శిలువవలె నైనా
ముళ్ళ, శిరస్త్రాణం వలెనే నైనా

ధరించీ, దహించీ, దాహించీ ప్రేమించీ
కన్నుమిన్నులెరుగక మోహించీ ఇక
మృత్యు స్మృతి ముద్రికలై ఇతరునిలో

సర్వ కాలాల పాప పరిహారమై
పునర్యానమై, తల్లి గర్భమై
చెలి స్థన్యమై, అలా మిగిలీ/
                                     పోయీ? 

No comments:

Post a Comment