05 December 2012

శూన్యం

కిటికీ అంచున కళ్ళను ఉంచుతాను. నెత్తురంటిన తామర పూవుల్లా
    విచ్చుకున్న కళ్ళను, ఉదయమంతా కరకు కాంతికీ, ఇసుక గాలికీ
     కోసుకుపోయిన కళ్ళనూ, మరి మాడిపోయిన కనురెప్పలనూ

కిటికీ అంచున ఉంచుకుంటాను, చీకటి చెమ్మకీ రాత్రి సుర్మాకీనూ
     ఇంత తడి తాకి, కళ్ళు మొలకెత్తవచ్చుననీ, ఇంత తేమ సోకి
     మాడిన కనురెప్పలు ఆరి, కలత అంటిన కనులలోకి మరి

తల్లి పాల వంటి నిదుర చినుకులు రాలవచ్చుననీ, అర్ధించే దోసిళ్ళ వలే
     కళ్ళను చాపి ఒక్కడినే మనిషంత కిటికీ ముందు, గదంత రాత్రి ముందు
    మరి ఎవరో ఒక వాయిద్యకారుడు మరచిపోయిన, వేణువంతటి నా

శరీరం ముందూ నన్ను నేనే ఉంచుకుంటాను, ఒక్కడినే

అరచేతులలో దాగేందుకు అలసి మోకరిల్లిన శిరస్సు, ఇక బరువుగా
    ధరిత్రి అంత భారంతో ఒక నల్లటి ఒంటరితనంతో, ఒడలు జలదరించే
    అంతం లేని ఒక మహాశూన్యంలోకి రాలిపోయే వేళల్లో, నాకు నేనే

ఒక్కడినే - నాకు నేను లేక - ఈ కిటికీ అంచున తెగిన పాదాలతో.
 
మరి ధూళి నిండిన ఈ చీకటిలో, చేతివేళ్ళతో నను అందుకుని
నెత్తురో, వెన్నలో ఉబికే నీ పెదాలతో
నన్ను ఊదేందుకు వస్తావా నువ్వు?                             

No comments:

Post a Comment