01 December 2012

పావురాళ్ళు

"ఎందుకో గూ గూ అని ర్రుర్ర్ర్ ర్రూర్ర్ మని గులుగుతాయి
     నలు చదరపు అంతస్తులలో కిటికీల కింది గోడలపై
          మెరిసే చల్లటి గాలిలో ఒదిగి ముడుచుకున్న పావురాళ్ళు.

శరీరమంతా తెలియని తపన నిండిపోతుంది. మరి ఇక
     శరీరం రోమాంచితమై, అంచుల చివరన అగ్గి అంటు
          కుంటోంది. ఏదో కాంతి వెలిగి పుష్పించి, శరీరంలోంచి

బయటకి తొణుకుతోంది. తెలియటం లేదా నీకూ?" అని అడిగింది
తను. నేను లేచి, ఆ మెల్లటి తెల్లటి
చల్లటి మధ్యాహ్నం నిమ్మకాయతో

చేసిన ఆవిర్లు కక్కే తేనీరుని చేసుకుని వచ్చిన కాలంలో.ఇక మేం
ఇక మేమే తాగాం, సాయంత్రాన్ని దాటి రాత్రి దాకా
రాత్రిని దాటి చీకట్లో విరిసిన ఓ ఎర్రటి చంద్ర బింబం
దాకా - నన్ను తనూ, తనని నేనూ. ఇరువురమూ
ఇరువురమై, రెండు బూడిద రంగు పావురాళ్ళమై- 

అంతసేపూ గూళ్ళలేని ఆ పావురాళ్ళే ఇక
మా వంక ఆ సమయమంతా - నిశ్శబ్ధంగా. 

No comments:

Post a Comment