21 December 2012

నీ బాల్కనీలో, ఒక బాటిల్ తో

ఊరకే ఒక బాటిల్ తో కూర్చుంటావు నువ్వు, నీతో నువ్వు
ఈ చీకటి బాల్కనీ అంతాన

కుండీలో కొమ్మకి పూచిన చుక్కను
రాలిన ఒక చినుకులో, తడుపుతూ

ఇక వేలి చివరన తడిగా పొటమర్చిన నెత్తురు బొట్టును చప్పరించి

ఇలా అనుకుంటావు ఇక నింపాదిగా: 'ఎలా

వచ్చింది ఇది, కన్నుల్లో, కనురెప్పల
అంచుల్లో మొలచిన ఈ కన్నీటి చుక్క

చిక్కగా, ముందుగా, ఈ గదిలోకీ, ఆపై మదిలోకీ, ఆపై ఆఖరి ఊపిరితో
ఈ గాజుపాత్రను తపనగా పట్టుకున్న
ఈ వేళ్ళ అంచులలోకీ ఎలా వచ్చిందీ

కన్నీటి కాంతీ,కరకు శాంతీ
ఊరకే ఒక బాటిల్ గా మారి
మధువు  దీవెనగా మారి, 'నువ్వు' అనే శాపంగా మారి, నీతో నువ్వే

మరి ఒక చీకటి అంతాన నీ బాల్కనీలో
పాత్ర అంచున మెరిసే, కత్తిగాటు వంటి
నీ ప్రతిబింబంతో? 

No comments:

Post a Comment